తలపతి విజయ్ యంగ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రూపొందిన విజిల్ దీపావళి పండగ సందర్భంగా విడుదలైన విషయం తెలిసిందే. ఏ జి ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిన విజిల్ మూవీలో విజయ్ సరసన నయనతార నటించగా, ఒక ముఖ్యమైన పాత్రలో దీపక్ నటించాడు. చాలా గ్యాప్ తరువాత ఫుట్ బాల్ కోచ్‌గా ఈ చిత్రంలో నటించినందుకు, ఈ చిత్ర విజయంలో తానూ ఓ భాగమైనందుకు సంతోషిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నాడు.
ఈ సందర్భంగా హీరో దీపక్ మాట్లాడుతూ.. “బాలీవుడ్‌లో గురు, ప్యాషన్ చిత్రాల తరువాత మెయిన్ హీరోగా మూడు చిత్రాలు చేశాను అవి విజయం సాధించలేదు. మళ్ళీ 2016లో రుస్తుం చిత్రంలో అక్షయ్ కుమార్ అపోజిట్‌గా నటించాను. ఆ చిత్రంలో ప్రతి నాయకుడిగా మంచి పేరు వచ్చింది. తమిళ్ సినీరంగంలో దర్శకుడు అట్లీ గురించి విన్నాను. తనే స్వయంగా ఈ చిత్రంలో చేయమని ఫోన్ చేసి అడిగాడు. చాలా ఇంపార్టెంట్ పాత్ర అని చేశాను. విడుదలైన రోజునే థియేటర్‌లో సినిమా చూసాను.
ఇక విషయానికొస్తే… ఈ చిత్రం తెలుగులో ‘విజిల్’గా విడుదల అయ్యింది అన్న విషయం నాకు మరింత సంతోషాన్ని కలిగించింది ఎందుకంటె హీరోగా నా పుట్టుకనిచ్చింది తెలుగు సినీరంగం సంపంగి నుండి మిత్రుడు వరకు నేను చేసింది పది చిత్రాలైన నన్ను ఎంతగానో ఆదరించారు తెలుగు ప్రేక్షకులు. వారికి మారోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ఇక ఈ చిత్రం విషయానికొస్తే…..ఎప్పుడు కొత్త కథనాన్ని ఎంపిక చేసుకునే విజయ్ ఈ సారి కూడా దక్షిణ భారతానికి ఓ కొత్త కాన్సెప్ట్ అందించాడు. దర్శకుడు అట్లీ మరో మారు ఈ చిత్రంతో తన ప్రతిభ నిరూపించుకున్నాడు. విజయ్ లాంటి స్టార్ హీరో ఇమేజ్‌కి తగ్గట్టుగా ఆయన కథలు ఎంచుకొనే విధానం, తెరపై చూపించే తీరు అద్భుతం. మాస్ పల్స్ కి దగ్గర చిత్రాలు తీయడంలో అట్లీకి ఉన్న విజన్‌ని మెచ్చుకోవాల్సిందే.
అయితే తమిళ ప్రేక్షకుల నేటివిటీకి దగ్గరగా సాగే కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులకు కొంచెం కనెక్ట్ కాకపోవచ్చు కానీ కాన్సెప్ట్ ప్రకారం యూనివర్సల్‌గా ఈ పాయింట్ అందరికి నచ్చుతుంది. ఇందులో నేను ఫుట్‌బాల్ కోచ్‌గా నటించాను ఈ చిత్రం చూసిన కొంతమంది టాలీవుడ్ డైరెక్టర్స్ నుండి ఫోన్స్ వచ్చాయి. నా మొదటి సినిమా సంపంగి వచ్చి ఇప్పటికి 18 సంవత్సరాలు అవుతుంది. నీలో భౌతికంగా ఎలాంటి మార్పు రాలేదు మంచి ఫైట్ నెస్ వుంది అప్పటి కంటే ఇప్పుడు లుక్ వైస్ చాలా బాగున్నావ్ అంటున్నారు.
తెలుగులో మళ్ళీ కంటిన్యూ చెయ్యొచ్చు కదా? అని అడిగారు. మళ్ళీ మంచి పాత్రలకు ఏమైనా అవకాశం ఇస్తే తప్పని సరిగా చేస్తాను” అంటూ తెలుగులో తనకు అవకాశమిచ్చిన సాన యాదిరెడ్డి, శ్రీను వైట్ల, దిల్ రాజు, బోయపాటి శ్రీను, నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి, బి ఏ రాజు, శ్రీమతి మంజుల నాయుడు, శివలంక కృష్ణ ప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.