సైబర్ నేరగాళ్లు, కిలాడీ మహిళలు నగరాల్లో నెరపుతున్న డేటింగ్ యాప్ మోసాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. సాధారణ పౌరులే కాకుండా చట్టం, న్యాయం తెలిసిన ప్రముఖులను కూడా ఈ కేటుగాళ్లు తమ వలలో వేసుకుని భారీగా గుంజుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో వెలుగుచూసిన ఒక సంచలనాత్మక సంఘటనలో, డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ఒక కేటుగాళ్ల ముఠాకు చిక్కి నగరానికి చెందిన ఒక ప్రముఖ న్యాయవాది ఏకంగా రూ. 5 కోట్లకు పైగా పోగొట్టుకున్నారు.
బాధితుడైన లాయర్‌కు కొద్దిరోజుల క్రితం ఒక ప్రముఖ డేటింగ్ యాప్ ద్వారా ఒక మహిళ పరిచయమైంది. కొద్దిరోజులు మెసేజ్‌లు, ఫోన్ కాల్స్‌తో చాటింగ్ చేస్తూ అతడితో సాన్నిహిత్యం పెంచుకుంది. సదరు మహిళ పక్కా ప్లాన్ ప్రకారం బాధితుడిని ఒక ప్రైవేట్ ప్రాంతానికి రప్పించింది. అక్కడ ఇద్దరూ గడిపిన ఏకాంత క్షణాలను, సంభాషణలను బాధితుడికి తెలియకుండానే రహస్య కెమెరాల ద్వారా రికార్డ్ చేసింది.
ఆ వీడియోలను ఆధారంగా చేసుకుని కేటుగాళ్ల ముఠా రంగంలోకి దిగింది. వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని, కుటుంబ సభ్యులకు పంపిస్తామని, సమాజంలో పరువు తీస్తామని బెదిరించడం ప్రారంభించింది. తన వృత్తిగత, వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతింటుందనే భయంతో బాధితుడు కేటుగాళ్లు అడిగినప్పుడల్లా దఫదఫాలుగా డబ్బులు బదిలీ చేస్తూ వచ్చాడు. ఇలా కొద్ది నెలల వ్యవధిలోనే బ్యాంకు ఖాతాలు, డిపాజిట్లు ఖాళీ చేసి ఏకంగా రూ. 5 కోట్లకు పైగా ఆ ముఠా ఖాతాల్లోకి జమ చేశాడు.
ఎంత డబ్బు ఇచ్చినా ఆ కేటుగాళ్ల వేధింపులు, డిమాండ్లు ఆగకపోవడంతో, ఇక చేసేదేమీ లేక బాధితుడు ధైర్యం చేసి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.బాధితుడు డబ్బులు జమ చేసిన బ్యాంక్ ఖాతాలు, ఫోన్ నంబర్లు, ఐపీ అడ్రస్‌లను ఆధారంగా చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు.
Also Read:Kaaka:సెట్లో మెగా వేడుకలు..
డేటింగ్ యాప్‌ల ద్వారా కొత్త పరిచయాలు పెంచుకునే క్రమంలో ప్రజలు, ముఖ్యంగా యువత మరియు ప్రముఖులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. అపరిచితుల ఉచ్చులో పడి వ్యక్తిగత వివరాలు, వీడియోలను షేర్ చేయవద్దని స్పష్టం చేశారు.

