దళితబంధు పథకం అమలు కోసం రూ.500 కోట్ల ను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఖాతాకు రూ.500 కోట్లు నిధులను విడుదల చేశారు. ఈ సందర్బంగా జమ్మికుంట టౌన్ లోని గాంధీ సెంటర్ జంక్షన్ వద్ద స్థానిక దళిత నాయకులు,కౌన్సిలర్లు,ముఖ్య నాయకులతో కలిసి మంత్రి కొప్పుల ఈశ్వర్,ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్,కోరుకంటి చందర్ లు మిఠాయిలు పంచి.. టపాసులు కాల్చి సంబరాలు జరిపారు. దళిత బంధు ద్వారా దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దళిత బంధు ఒక పథకం కాదని, ఉద్యమం అని, దీనిని మున్ముందుకు తీసుకుపోతామని సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తరతరాలుగా చీకట్లో మగ్గిన దళితుల జీవితాలలో వెలుగులు నింపేందుకు తెచ్చిన ఇలాంటి పథకం దేశంలో ఇప్పటివరకు లేదన్నారు. దేశ ప్రజలందరూ మరోసారి తెలంగాణ వైపు చూస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. కేసీఆర్ ఆలోచనలు, కార్యదీక్ష, సుపరిపాలనను ప్రశంసిస్తున్నారన్నారు.
నిన్నటి దాక అవాకులు, చవాకులు పేలిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు నోట మాట రావట్లేదన్నారు. ఆ పార్టీలు చాలా రాష్ట్రాలలో అధికారంలో ఉన్నాయి. కానీ, ఏ ఒక్క చోట కూడా ఇటువంటి మహత్తరమైన కార్యక్రమం చేపట్టలేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రతిపక్షాలకు ఈ రాష్ట్రంలో ప్రజల కనీస మద్దతు లేదన్నారు. దళితులతో పాటు అన్ని వర్గాలకు చెందిన వాళ్లు కేసీఆర్ నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఈనెల 16 తేదీన జమ్మికుంటలో జరిగే కేసీఆర్ సభకు తరలి వచ్చి జయప్రదం చేయాల్సిందిగా దళితులకు కొప్పుల పిలుపునిచ్చారు.