ఈ నెల 16 నుంచి పెట్రోల్ ధరలు రోజూ మారనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 రోజులకోసారి పెట్రో ఉత్పత్తుల ధరలను ఆయిల్ కంపెనీలు సమీక్షిస్తున్నాయి. మే 1 నుంచి ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తుండగా.. జూన్ 16 నుంచి దేశం మొత్తం ఈ విధానాన్ని అమలు చేయాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్ణయించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కూడా రోజువారీ ఇంధన ధరల సవరణ విధానాన్ని అమలు చేస్తున్నారు. రోజువారీ ధరల సవరణతో పారదర్శకత పెరుగుతుందని, చిల్లర అమ్మకాల్లో ఒడిదుడుకులు చాలా వరకు తగ్గుతాయని చమురు కంపెనీలు అంటున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ప్రతి రోజూ కాస్త అటుఇటుగా మారుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రతి రోజూ మారే ధరలను వినియోగదారులు ముందుగానే తెలుసుకోవచ్చు. ప్రతి రోజూ ప్రతి పెట్రోల్ పంప్ దగ్గర ఆ రోజు ధరలను ముందుగానే ప్రకటిస్తారు. లేదా ఈ విధంగా ఓ ఎస్‌ఎంఎస్ పంపిస్తే సరిపోతుంది.
ఇక హిందుస్థాన్ పెట్రోలియం పెట్రోల్ పంప్స్‌లో ధరలు తెలుసుకోవడానికి HPPRICE స్పేస్ డీలర్ కోడ్‌ను 9222201122కు ఎస్సెమ్మెస్ చేయాల్సి ఉంటుంది. హెచ్‌పీసీఎల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని సదరు పెట్రోల్ పంప్‌ను లొకేషన్‌ను బట్టి ధరలు చెక్ చేసుకోవచ్చు.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ పంప్స్‌లో రోజువారీ పెట్రోల్ ధరలను తెలసుకోవాలంటే.. RSP స్పేస్ డీలర్ కోడ్‌ను 9224992249కు ఓ ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. డీలర్‌కోడ్ ప్రతి పెట్రోల్ పంపులో రాసి ఉంటుంది.
ఇక భారత పెట్రోలియం పెట్రోల్ పంప్స్‌లో రేట్ల కోసం RSP స్పేస్ డీలర్‌కోడ్‌ను 9223112222కు ఎస్సెమ్మెస్ చేయాలి. స్మార్ట్‌డ్రైవ్ యాప్ ద్వారా కూడా పెట్రోల్ బంక్ లొకేట్ చేసి ధర తెలుసుకోవచ్చు. లేదంటే భారత్ పెట్రోలియం వెబ్‌సైట్‌కు వెళ్లి చెక్ చేసుకోవచ్చు. టోల్‌ఫ్రీ నంబర్ 1800224344 నంబర్‌కు డయల్ చేసినా పెట్రోల్ ధరలు తెలుస్తాయి.
మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీగా సవరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెట్రోల్ బంకుల యజమానులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. జూన్ 16 నుంచి ప్రభుత్వ చమురు సంస్థల నుంచి పెట్రోల్, డీజిల్ కొనకూడదని నిర్ణయించారు. ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని పెట్రోల్ బంకుల యజమాన్య సంఘాలు తెలిపాయి. అదే జరిగితే పెట్రోల్ బంకులు ఖాళీ అయిపోయి వినియోగదారులకు తిప్పలు తప్పవు.