దాదాపు 60 కోట్ల (600 మిలియన్లు) సంవత్సరాల క్రితం జీవించిన ఒక చిన్న ఒంటికంటి జీవి, మానవులతో సహా అన్ని వెన్నెముక ఉన్న జీవుల కళ్ల పరిణామాన్ని నిర్దేశించి ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఆ ప్రాచీన జీవి నేడు మన మెదడులోని ‘పీనియల్ గ్రంథి’ రూపంలో మిగిలి ఉందని ఇది మన నిద్రను పగటి వెలుతురుతో అనుసంధానించడంలో సహాయపడుతుందని వారు కనుగొన్నారు.
స్వీడన్‌కు చెందిన లుండ్ యూనివర్సిటీ మరియు యూనివర్సిటీ ఆఫ్ సస్సెక్స్ శాస్త్రవేత్తలు చేపట్టిన అధ్యయనం ప్రకారం, వెన్నెముక కలిగిన జీవుల తొలి పూర్వీకుడు 60 కోట్ల సంవత్సరాల క్రితం ఒక ‘సైక్లోప్స్’ (ఒంటికంటి రాక్షసుడు లేదా జీవి) రూపంలో ఉన్న దశను దాటి వచ్చాడని వెల్లడైంది.
ఆ జీవి తల మధ్యలో ఉన్న ఒకే కన్ను, ఆ తర్వాత నేటి వెన్నెముక జీవులలో ఉండే రెండు కళ్ల ఏర్పాటుకు (ప్యాక్డ్ ఐస్) దోహదపడింది. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆ ప్రాచీన దృష్టి వ్యవస్థలోని ఒక భాగం ఇప్పటికీ ఆధునిక మెదడులో పీనియల్ గ్రంథిగా సజీవంగా ఉంది, ఇది నిద్రను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
శాస్త్రవేత్తలు వివరించిన ఈ ప్రాచీన పూర్వీకుడు వానపాము వంటి శరీర ఆకృతి కలిగిన ఒక చిన్న జీవి. ఇది దాదాపు 60 కోట్ల సంవత్సరాల క్రితం సముద్రంలో నివసించేది. తన జీవితంలో ఎక్కువ భాగం ఒకే చోట ఉంటూ, సముద్రపు నీటిలోని ప్లవాంగాలను వడపోసి ఆహారంగా తీసుకునేది. పరిణామ క్రమానికి ముందు ఈ జీవికి రెండు కళ్ళు లేదా కనీసం కాంతిని గుర్తించే రెండు కణాల సమూహాలు ఉండేవి. జంతు సామ్రాజ్యంలో జంట కళ్ళు సాధారణంగా ఉంటాయి, ఎందుకంటే అవి కదిలే జీవులకు దిశ, దూరం మరియు వస్తువుల ఉనికిని అంచనా వేయడానికి సహాయపడతాయి.
మన పరిణామ వృక్షంలో ఉన్న ఆ జంట కళ్ళు కేవలం కాంతిని గుర్తించే కణాలా లేక బొమ్మలను చూడగలిగే సాధారణ కళ్లా అనేది మాకు తెలియదు. అయితే ఆ జీవి ఆ తర్వాత కాలంలో వాటిని కోల్పోయిందని మాత్రం మాకు తెలుసు” అని ప్రొఫెసర్ నిల్సన్ చెప్పారు.
ఈ జీవి నిశ్చలమైన (ఒకే చోట ఉండే) జీవనశైలికి అలవాటుపడటంతో, జంట కళ్ల అవసరం లేకుండా పోయింది. అనేక తరాల తర్వాత, ఆ కళ్ళు ఉపయోగం లేక క్రమంగా కనుమరుగయ్యాయి. లక్షలాది సంవత్సరాల తర్వాత ఈ జీవి యొక్క సంతతి మళ్లీ సముద్రంలో ఈదడం (యాక్టివ్ లైఫ్‌స్టైల్) ప్రారంభించింది. కదిలే జీవనశైలి వల్ల మళ్లీ చూపు అవసరం పడింది. ప్రత్యేకించి ఆహారాన్ని, అడ్డంకులను, శత్రువులను గుర్తించడానికి చూపు అత్యవసరమైంది.
Also Read:వీడియో.. టీచర్ ‘సెల్ఫ్ అటెండెన్స్ బోర్డ్’!
పరిశోధకుల ప్రకారం ఆ పాత మధ్య కన్ను (ఒంటికన్ను) యొక్క భాగాలే పరిణామ క్రమంలో రూపాంతరం చెంది, కొత్తగా బొమ్మలను చూడగలిగే జంట కళ్లుగా ఏర్పడ్డాయి. ఈ విచిత్రమైన పరిణామ క్రమమే.. వెన్నెముక ఉన్న జీవుల (మానవులు, జంతువులు) కళ్లు, ఇతర జీవుల (కీటకాలు, స్క్విడ్స్ వంటివి) కళ్ల కంటే పూర్తిగా భిన్నంగా ఉండటానికి కారణం!
వెన్నెముక ఉన్న జీవుల కళ్లు.. కీటకాలు మరియు అక్టోపస్/స్క్విడ్ వంటి ఇతర జంతువుల కళ్ల కంటే ఎందుకు అంత భిన్నంగా ఉన్నాయో ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమైంది. మన కంటి పొర (రెటీనా) మెదడు నుండి ఉద్భవించింది, కానీ కీటకాలు మరియు స్క్విడ్‌ల కళ్లు తల ఉపరితల చర్మం నుండి ఉద్భవిస్తాయి అని ప్రొఫెసర్ నిల్సన్ వివరించారు.

