‘ఫొని’ బీభత్సానికి 21 మంది బలి..!

209

ఫొని ప్రళయానికి ఒడిశా విలవిలలాడింది. తుపాను ప్రభావంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. తుపాన్‌ బీభత్సానికి పూరీ పట్టణంలోనే 21 మంది మృత్యువాత పడ్డారని జిల్లా కలెక్టర్‌ ప్రకటించారు. ఇళ్ల గోడలు కూలిన ఘటనలో 9 మంది చనిపోయారని ప్రకటించారు. తాజాగా వెలుగు చూస్తున్న ఘటనలతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఆస్తి నష్టం భారీగా ఉందని, లక్షల సంఖ్యలో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నేలకూలాయని కలెక్టర్‌ ప్రకటించారు. విద్యుత్‌, టెలికాం సేవలు పూర్తిగా స్తంభించి పోయాయి.

Cyclone Fani

ఫొని తుపాన్‌ బీభత్సంపై ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ అధికారులతో సమీక్షించారు. వేసవిలో సంభవించిన అత్యంత అరుదైన తుఫాన్ ఫొని అని, గత 43 ఏండ్లలో ఇలాంటి తుఫాన్ రావడం ఇదే తొలిసారి అని, 150 ఏండ్లలో మూడోది అని అన్నారు. విద్యుత్, రోడ్ల పునరు ద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని సీఎం చెప్పా రు. తుఫాన్ ప్రభావంపై ప్రధాని మోదీ శనివారం సీఎంతో మాట్లాడారని, ఆదివారం లేదా సోమవారం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని పర్యటించే అవకాశం ఉందని సీఎంఓ వర్గాలు తెలిపాయి. తుఫాన్ రాకకు 24 గంటల ముందే 10 వేల గ్రామాలు, 52 పట్టణాల నుంచి సుమారు 12 లక్షల మంది ప్రజలను తరలించామని సీఎం చెప్పా రు. 880 సైక్లోన్ కేంద్రాలు, 4 వేలకు పైగా కేంద్రాల్లో వీరికి పునరావాసం కల్పించినట్లు ఆయన చెప్పారు.

Cyclone Fani

విపత్తు సమయంలో భారీగా తరలింపు చేపట్టడం మనదేశంలో ఇదే మొదటిసారన్నారు. 15 రోజుల వరకు బాధితులకు సాయం కొనసాగించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఒడిశాలో 2 వేల మంది ఎమర్జెన్సీ సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్, ఓడీఆర్‌ఎఫ్ సిబ్బంది, లక్ష మంది అధికారులు, స్వచ్ఛంధ కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ తెలిపారు.