విరుచుకుపడే గాలులు..ముంచెత్తే భారీ వర్షాలు..ఎగిసిపడే భయానక అలలతో ఒడిశా,ఉత్తరాంధ్ర చిరుగుటాకులా వణికిపోతున్నాయి. తీరంలో గంటకు 150 కిమీల వేగంతో గాలులు వీస్తుండటంతో ఏ చెట్టు కూలుతుందో…ఏ స్తంభం కూలి విద్యుత్ తీగలు తెగిపడతాయోనని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు.
తుఫాన్ తీరాన్ని తాకే సమకంలో గంటకు 200 కి.మీ.కు వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో పదో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుఫాన్ ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రజలకు ఇప్పటికే సహాయ కేంద్రాలకు తరలించారు. ప్రధాన జాతీయ రహదారులపై రాకపోకలను నిలిపివేశారు అధికారులు. ఈదురుగాలులకు భారీవృక్షాలు నెలకొరిగాయి. చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో గ్రామాలు అంధకారంలో మునిగిపోయాయి. తుఫాను కారనంగా తూర్పు కోస్తాలో 107 రైళ్లను రద్దు చేశారు అధికారులు. మరోవైపు విశాఖ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించాల్సిన 22 విమానాలను రద్దు అయ్యాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
ఉగ్రరూపం దాల్చిన పెనుతుపాను పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా దిశగా పయనిస్తోంది. శ్రీకాకుళం తీరం మీదుగా ఒడిశాలోని గోపాలపూర్-చాంద్‌బలీ మధ్య శుక్రవారం మధ్యాహ్నం తీరం దాటుతుందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. ఇది తీరం దాటేంత వరకు శ్రీకాకుళం జిల్లాకు ముప్పు ఉంటుందని హెచ్చరించింది. పశ్చిమబంగకు చేరుకునే సరికి తీవ్ర తుపానుగా బలహీనపడుతుందని, ఆ సమయంలో గాలుల వేగం గంటకు 90 కిలోమీటర్ల నుంచి 115 కిలోమీటర్లు ఉండొచ్చని అధికారులు చెప్పారు.