శ్రీలంక సమీపంలో ఏర్పడిన లోతైన వాయుగుండం గురువారం బంగాళాఖాతంలో సైక్లోన్ ‘దిత్వాహ్’గా మారి, ప్రస్తుతం ఉత్తర–వాయవ్య దిశగా కదులుతోంది. నవంబర్ 30న తమిళనాడు తీరాన్ని తాకే అవకాశముందని IMD ప్రకటించింది. IMD ప్రకారం, సైక్లోన్ దిత్వాహ్ నవంబర్ 30 తెల్లవారుజామున ఉత్తర తమిళనాడు–పుదుచ్చేరి తీరాన్ని దాటే అవకాశం ఉంది. నవంబర్ 29 నుంచి 30 వరకు తమిళనాడులోని దక్షిణ జిల్లాలు మరియు కావేరి డెల్టా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
తమిళనాడుతో పాటు కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా తుపాను ప్రభావం ఉండనుంది.కడలూరు, మయిలాడుతురై, విల్లుపురం, చెంగళపట్టు, పుదుచ్చేరి ప్రాంతాలకు అత్యంత భారీ వర్షాల అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.శ్రీలంకలో తుపాను బీభత్సం సృష్టించి ఇప్పటివరకు 69 మంది మృతి, మరికొందరు గల్లంతయ్యారు.
ప్రస్తుతం సైక్లోన్ దిత్వాహ్ గంటకు 8 కి.మీ వేగంతో కదులుతోంది. ఇది పుదుచ్చేరి నుంచి సుమారు 300 కిలోమీటర్లు, చెన్నైకి 400 కిలోమీటర్ల దక్షిణ దిశలో ఉంది. దిత్వాహ్ తుపాను ప్రభావంతో గత మూడు రోజులుగా శ్రీలంకలోని కొలంబో బండారనాయక అంతర్జాతీయ విమానాశ్రయంలో 300 మంది భారతీయులు చిక్కుకున్నారు. వీరిలో దాదాపు 150 మంది దుబాయి నుంచి భారతదేశానికి శ్రీలంక ద్వారా ప్రయాణిస్తుండగా ఇరుక్కుపోయారు.
దిత్వాహ్ తుపాను కారణంగా తీవ్ర నష్టం జరిగిన శ్రీలంకకు భారత్ తక్షణ సహాయాన్ని అందించింది. కనీసం 69 మంది ప్రాణాలు కోల్పోవడంతో, భారత ప్రభుత్వం రక్షణ బృందాలను పంపింది. NDRF ప్రకారం, 80 మంది రక్షకులతో కూడిన రెండు బృందాలు శుక్రవారం ఉదయం శ్రీలంకకు పంపబడ్డాయి. అదనంగా 21 టన్నుల సహాయక సామగ్రి—టెంట్లు, దుప్పట్లు, మంచాలు, డిగ్నిటీ కిట్స్ మరియు అత్యవసర వస్తువులు—కూడా పంపించింది. తుపాను దిత్వాహ్ కారణంగా శ్రీలంకలో జరిగిన ప్రాణనష్టంపై సంతాపం వ్యక్తం చేసిన భారత ప్రభుత్వం, దేశ పునరుద్ధరణకు సహాయం చేయడానికి ‘ఆపరేషన్ సాగర్–బంధు’ ప్రారంభించింది. రక్షణ బృందాలు, సహాయక సామగ్రి పంపే కార్యక్రమం ఇది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా చెన్నై విమానాశ్రయం అధికారులు 54 విమానాలను రద్దు చేశారు.
Also Read:HILT Scam:ఉత్తమ్‌కు ఏలేటి సవాల్

