TTD:తిరుమలలో దళారుల ఏరివేత

10
- Advertisement -

తిరుమల శ్రీవారి భక్తులను మోసగిస్తున్న దళారులను కనిపెట్టి ఎప్పటికప్పుడు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా టీటీడీ ఈవో జె.శ్యామలరావు జిల్లా ఎస్పీని కోరారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో బుధవారం ఉదయం జిల్లా పోలీస్, టీటీడీ నిఘా మరియు భద్రత విభాగం అధికారులతో ఈవో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే వేలాది మంది భక్తులకు అవసరమైన వసతి, దర్శనం, ఆర్ధితసేవ టికెట్లకు సంబంధించి భక్తులను మోసగిస్తున్న అనేకమంది దళారులను ఉపేక్షించరాదన్నారు. వారిపై వెంట వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

సివిఎస్ఓ వివరించిన ఆవశ్యకత మేరకు తిరుమలలో ఐటి అనుబంధంగా ఉన్న కేసులను సత్వరం పరిష్కరించేందుకు సైబర్ క్రైమ్ టీం ఏర్పాటు పరిశీలించవలసిందిగా సంబంధిత అధికారులకు ఈవో సూచించారు.

అంతకుముందు పోలీస్ విభాగం వారు తిరుమలలో దర్శన దళారులకు సంబంధించి, ఆన్లైన్ ద్వారా, డిప్ సిస్టం ద్వారా, రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసులు, దొంగతనం కేసులు, మధ్యపానం, నకిలీ వెబ్సైట్లు, తదితర అంశాలకు సంబంధించిన కేసులు ఏఏ దశల్లో ఉన్నాయో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ఈవో మాట్లాడుతూ మరో వారంలోపు ఈ కేసుల్లో ఉన్న దళారులకు చట్టపరంగా తగు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ అధికారులను కోరారు. అంతేకాకుండా ఇటువంటి కేసుల సత్వర పరిష్కారం కోసం టీటీడీ విజిలెన్స్, పోలీస్ విభాగాలు తరచూ సమావేశం కావాలన్నారు.

Also Read:బిగ్‌బాస్‌లోకి వేణుస్వామి?

- Advertisement -