నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఉద్యోగులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.శనివారం బిఆర్ కెఆర్ భవన్‌లో ఉద్యోగుల మధ్య కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ ఐఏఎస్,ఐపిఎస్, ఐఎఫ్ ఎస్ అధికారులతో పాటు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా మరింత ఉత్సాహంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను అన్ని శాఖలు సమన్వయంతో ఒక టీం వర్క్ లాగా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలన్నారు. సచివాలయం, హెచ్‌ఓడీలు, జిల్లాలలో అన్ని కేడర్లలో పదోన్నతులను జనవరి నెలలో పూర్తి చేయడానికి వెంటనే చర్యలు ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని శాఖల కార్యదర్శులను కోరారు. పదోన్నతుల్లో జాప్యం లేకుండా చూడాలన్నారు.
రాష్ట్రంలో ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ శాఖల ద్వారా మరింత ఆదాయం సాధించేలా వచ్చే 3 నెలలు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను కోరారు. శనివారం బిఆర్ కెఆర్ భవన్ లో ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ శాఖల అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ ల ద్వారా ఆదాయ సాధనకు టీం వర్క్ తో కృషి చేస్తున్నందుకు అభినందనలు తెలుపుతూ, రాబోయే రోజులలో అధికారులు మరింత కృషిచేసి రాష్ట్ర ఆర్ధిక పరిపుష్ఠికి పునరంకితులు కావాలని కోరారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఎక్సైజ్ శాఖలో వివిధ క్యాటగిరీలలో 131 పోస్టులు మంజూరు, నూతనంగా 14 ఎక్సైజ్ స్టేషన్లు, కమర్షియల్ టాక్స్ శాఖలో 161 పోస్టులు,18 నూతన సర్కిళ్ళు మంజూరు చేసిందని వివరించారు. ఈ శాఖలలో చాలా పోస్టులు అప్ గ్రేడ్ చేయటం వలన సిబ్బందికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు మెరుగవుతాయని అన్నారు. శాఖల రీఆర్గనైజేషన్ వలన ఉద్యోగుల కేరీర్‌లో పురోగతి ఉండటంతో పాటు విధుల నిర్వహణలో సంతృప్తికి అవకాశం కలుగుతుందన్నారు. ఈ శాఖల రీ ఆర్గనైజేషన్ వలన ఈ శాఖలలో పనిచేసే సిబ్బందికి ప్రమోషన్లు లభిస్తాయని అన్నారు. ప్రమోషన్లకు సంబంధించి ప్రాసెస్ ఇప్పటికే మొదలైందన్నారు. ఈ నూతన సంవత్సరంలో చాలామంది ఉద్యోగులు ప్రమోషన్లు పొందుతారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.