పోడు భూముల సమస్యకి శాశ్వత పరిష్కారం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి అధ్యక్షతన మంత్రులు ఇంద్ర కరణ్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, అజయ్ కుమార్ గార్లతో వేసిన క్యాబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం బూర్గుల రామకృష్ణారావు భవన్ లో నేడు జరిగింది.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి క్రిస్టినా, అటవీ శాఖ పిసిసీఎఫ్ శ్రీమతి శోభ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రెండు గంటలకు పైగా పోడు భూముల సమస్య – పరిష్కారం, పర్యావరణ – పరిరక్షణ, అటవీ భూముల సంరక్షణ, ఆర్. ఓ.ఎఫ్.ఆర్ చట్టం అమలు, గిరిజనులు, గిరిజనేతరుల హక్కులను కాపాడడం పై కమిటీ క్షుణ్ణంగా చర్చించింది. ఈ నెల 24వ తేదీన మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది.