సహాయ చర్యలపైసీఎస్ శాంతి కుమారి టెలీకాన్ఫరెన్స్

39
- Advertisement -

రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు వరద బాధిత ప్రాంతాలలో ముమ్మరంగా సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు భారీ వర్షాలు, వరదల జిల్లాల్లో చేపట్టిన సహాయ, పునరావాస చర్యలు, ముందు జాగ్రత చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లతో నేడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో డీజీపీ అంజనీ కుమార్, ప్లానింగ్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఫైర్ సర్వీసుల శాఖ డీజీ నాగిరెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, ఖమ్మం పట్టణానికి వెంటనే ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని, బూరుగుంపాడు కు హెలీకాఫ్టర్ ను వెంటనే పంపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ఆదేశాల మేరకు వెంటనే ఈ బృందాలను పంపిస్తున్నామని తెలియచేసారు. వరద పీడిత ప్రాంతాలలతోపాటు ప్రయాణికులు చిక్కుకున్న రైల్వే స్టేషన్లు, బస్టాండులు, రహదారులలోనూ సహాయ కార్యక్రమాలను చేపట్టాలని స్పష్టంచేశారు. జిల్లాలకు అవసరమైన బ్లాంకెట్లు, దుప్పట్లు, అదనపు మందులను పంపించడం జరుగుతుందని తెలిపారు.

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటివరకు జిల్లా కలెక్టర్లు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సమష్టిగా కృషి చేశారని అభినందించారు. అదేమాదిరిగా రానున్న రోజుల్లో కూడా జిల్లాలో అన్ని శాఖల అధికారులతో టీమ్ వర్క్ చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్లు, సీపీ, ఎస్.పి.లు జిల్లా కేంద్రంలో ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. భారీ వర్షాలు, వరదల వల్ల చేపట్టాల్సిన ముందుజాగ్రత్త చర్యలపై, ప్రధానంగా జలపాతాలు, మత్తడి పోసే చెరువుల వైపు వెళ్లకుండా ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్య పర్చాలని అన్నారు.

Also Read:తెలంగాణనే నెంబర్ వన్ !

జిల్లాల్లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా ఆసుపత్రులు, ప్రయివేటు ఆసుపత్రులన్నీ 24 గంటలు తెరచి ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 108 గ్రామాల నుండి 10,696 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని వెల్లడించారు. భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామం నుండి 600 మందిని, పెద్దపల్లి జిల్లా మంథని లోని గోపాల్ పూర్ లో ఇసుక క్వారీ లో చిక్కుకున్న 19 మంది కార్మికులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని సి.ఎస్ వెల్లడించారు. మోరంచపల్లి లో ఆరుగురిని ఆర్మీ హెలీకాఫ్టర్లద్వారా తరలించామని తెలిపారు.

వివిధ జిల్లాల కలెక్టర్ల నుండి వచ్చిన విజ్ఞాపనలు మేరకు ఎన్డీఆర్ఎఫ్ తోపాటు ఇతర సహాయక బృందాలను పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మరో నాలుగు హెలికాఫ్టర్లు, 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపాల్సిందిగా కోరామని, ఇప్పటికే కొన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వస్తున్నాయని వెల్లడించారు.

Also Read:అరటిపువ్వుతో ఎన్ని ప్రయోజనాలో..!

- Advertisement -