రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు సీఎస్ సోమేశ్ కుమార్. మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే వజ్రోత్సవాలకు విస్త్రృత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు.కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈనెల 14 వ తేదీ నుంచి 18 వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు.
17న హైదరాబాద్‌లో ప్రధాన కార్యక్రమం నిర్వహిస్తామని …ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జాతీయ జెండాను ఎగువేస్తారని తెలిపారు. జిల్లా, మండల, గ్రామ పంచాయతీ ప్రధాన కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు. హైదరాబాద్‌లో జరిగే ఆదివాసీ, బంజారా భవన్‌ల ప్రారంభోత్సవం అనంతరం జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున గిరిజనులను తరలించేందుకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 18న అన్ని జిల్లా కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, అదేరోజు స్వాతంత్య్ర సమరయోధులు, కళాకారులకు సన్మానాలు నిర్వహించాలన్నారు.