నగరంలో మోడల్ ప్లాంటేషన్‌ను పరిశీలించిన సీఎస్..

75
cs
- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్ లోని చెరువుల గట్లు, శిఖం భూములు, ఖాళీ స్థలాల్లో చేపడుతున్న ప్లాంటేషన్ ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేడు పరిశీలించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నగరంలోని 185 చెరువులు, కుంటలలోని గట్లు, కట్టలు, శిఖం భూముల్లో పెద్ద ఎత్తున మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా అత్తాపూర్ లోని మల్క చెరువులో చేపట్టిన మోడల్ ప్లాంటేషన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొక్కలు నాటారు.

మల్క చెరువులో చేపట్టిన ఈ మోడల్ ప్లాంటేషన్ ను సి.ఎస్. సోమేశ్ కుమార్, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్ తో కలసి పరిశీలించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, తెలంగాణాకు హరిత హారం క్రింద నగరంలో ప్రతీ చిన్న ఖాళీ స్థలాన్ని వదలకుండా మొక్కలు నాటాలని అన్నారు. నగరంలోని అన్నిచెరువుల్లో మొక్కలను నాటే ప్రక్రియను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. చెరువుల్లో నీటి మట్టం తగ్గగానే ఆ భూముల్లో నీటి కానుగ (బేరింగ్ టోనియా ) మొక్కలను నాటాలని సోమేశ్ కుమార్ ఆదేశించారు. ఒక్క ఇంచు ఖాళీ స్థలాన్ని వదలకుండా ప్లాంటేషన్ చేయాలని, మల్క చెరువులో చేపట్టిన మాదిరిగానే మిగిలిన చెరువుల్లోనూ మోడల్ ప్లాంటేషన్ చేపట్టాలని సి.ఎస్. సూచించారు.

మల్క చెరువులో దాదాపు 30 రకాల వృక్ష జాతుల మొక్కలను నాటామని, ఇవి ప్రధానముగా స్థానికంగా లభించే వృక్ష జాతులని జీహెచ్ఎంసీ అధికారులు వివరించారు. మల్టి లేయర్ ప్లాంటేషన్ పద్దతిలో వివిధ పుష్పాల మొక్కలు, మెడిసినల్ ప్లాంట్ లు, సువాసన వెదజల్లే మొక్కలను నాటామని పేర్కొన్నారు. ఈ చెరువు కట్టపై దాదాపు ఒక కిలోమీటర్ వాకింగ్ ట్రాక్ ను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్బంగా జీహెచ్ఎంసీ అడిషనల్ కమీషనర్ కృష్ణ, జోనల్ కమీషనర్ అశోక్ సామ్రాట్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -