ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి ‘సాహో’ చిత్రంలో నటిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ పై క్రిమినల్ కేసు నమోదైంది. గత రెండు నెలల క్రితం విడుదలైన హసీనా పార్కర్ అనే చిత్రంలో శ్రద్ధా ప్రధాన పాత్ర పోషించింది.
ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ జీవితాధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. అయితే ఈ సినిమాలో శ్రద్ధ కపూర్ ధరించిన దుస్తువులను ఓ ప్రముఖ కంపెనీ డిజైన్ చేసింది.
ఒప్పందం ప్రకారం సదరు కంపెనీ పేరును సినిమాలో వేస్తామని నిర్మాత నహిత్ ఖాన్ మాటిచ్చారు. కానీ సినిమా మెత్తంలో ఎక్కడా కంపెనీ పేరు వేయలేదు. దీంతో కంపెనీ యాజమాన్యం, నిర్మాత నహిత్ ఖాన్ , శ్రద్ధా కపూర్‌పై ముంబై లోని అంధేరీ మెట్రలోపాలిటన్ కోర్టులో పిటీషన్ వేసింది. ఈ కేసును విచారణకు స్వీకరించిన కోర్టు దీనిపై ఎంక్వయిరీ చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది.
కోర్టు ఆదేశాల మేరకు నహిత్ ఖాన్, శ్రద్ధా కపూర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసిన తర్వాత అసలు విషయం ఏంటనేది వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్ర పోషించిన ఈచిత్రంలో అంకూర్ భాటియా, రాజేష్ తైలాంగ్‌లు కీలక పాత్రల్లో నటించారు. గత సెప్టెంబర్ 22న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
వాస్తవానికి ఈ కేసులో శ్రద్ధా కపూర్ ఉద్దేశ్య పూర్వకంగా చేసింది ఏమీ లేదు, ‘హసీనా పార్కర్’ సినిమాలో ముఖ్య పాత్ర పోషించడంతో ఆమె కూడా ఈ కేసులో ఇరుక్కోక తప్పలేదు.