కల నెరవేరేనా.. కప్పు కొడతారా?

38
- Advertisement -

130 కోట్ల భారతీయుల కల నెరవేరే సమయం రానే వచ్చింది. భారత క్రికెట్ కీర్తి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించే సమయం ఆసన్నమైంది. 13 ఏళ్ల తరువాత వన్డే ప్రపంచ కప్ కు అడుగు దూరంలో నిలిచింది టీమిండియా. నేడు అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మద్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న ఈ ఫైనల్ మ్యాచ్ లో కప్పు కోసం టీమిండియా ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ వరల్డ్ కప్ లో ఇప్పటివరకు అపజయమే ఎరుగని జట్టుగా వరుస విజయాలతో హాట్ ఫేవరేట్ గా ఉన్న టీమిండియా మూడోసారి కప్పు ముద్దాడేందుకు ఉవ్విళ్లూరుతోంది. అటు ఇప్పటివరకు ఐదు సార్లు వరల్డ్ కప్ గెలుచుకున్న ఆసీస్ జట్టు మరోసారి కప్పు సొంతం చేసుకొని ప్రపంచ క్రికెట్ లో తమకు ఎదురే లేదని నిరూపించేందుకు ఆరాటపడుతోంది..

ప్రస్తుతం రెండు జట్లు కూడా సమఉజ్జీలుగా ఉండడంతో ఏ జట్టు గెలుస్తుందనే దానిపై క్రీడా విశ్లేషకులు సైతం అంచనా వేయలేకపోతున్నారు. కాగా ఈ ఫైనల్ మ్యాచ్ లో టాస్ కీలకంగా మారే అవకాశం ఉంది. నరేంద్ర మోడీ స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశమున్నందున టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఇక జట్టు కూర్పు విషయంలో టీమిండియా ఆస్ట్రేలియా జట్లలో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు.

ప్రస్తుతం టీమిండియాలో రోహిత్ శర్మ, శుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కే‌ఎల్ రాహుల్.. ఇలా అందరూ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. బౌలింగ్ లో మహ్మద్ షమి సృష్టిస్తున్న సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షమికి తోడు మహ్మద్ సిరాజ్, బుమ్రా కు అద్భుతంగా రాణిస్తున్నారు. అటు ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్స్ హెడ్, వార్నర్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు.. వీరిద్దరిని వీలైనంత త్వరగా ఔట్ చేస్తేనే మంచిదని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. బౌలింగ్ దళంలో స్టార్క్, కమిన్స్, జంపా వీరిని సమర్థవంతంగా ఎదుర్కొనే టీమిండియాకు తిరుగుండదు. మరి భారత జాతి గర్వపడేలా మరోసారి టీమిండియా కప్పును ముద్దాడుతుందేమో చూడాలి.

Also Read:Dil Raju:మంగళవారం ఆ రెండు సిమాలు గుర్తొచ్చాయి

- Advertisement -