మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ మృతి..

579
gunda mallesh
- Advertisement -

బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే,సిపిఐ సీనియర్ నాయకులు గుండా మల్లేష్ మృతి చెందారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబందిత వ్యాదితో బాధపడుతున్న ఆయన నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం విషమించంతో చికిత్స పొందుతూ నేడు కన్నుమూశారు. ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. మల్లేష్ మృతి పట్ల సిపిఐ, పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టించారు.

గుండా మల్లేష్ (73) భార్య పేరు సరోజ ఆయనకు ఇద్దరు పిల్లలు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. మల్లేష్ స్వస్థలం తాండూర్ మండలం రేచిని గ్రామం.. 14.07.1947లో లక్ష్మీ-పోచమల్లు దంపతులకు జన్మించారు.ఆయన హెచ్.ఎస్.సి వరకు విద్యాభ్యాసం చేశారు.

రాజకీయ అనుభవం:

8 సార్లు ఎమ్మెల్యే గా పోటీ చేయగా.. 4 సార్లు గెలుపు, 4 సార్లు ఓటమి చెందారు. ఒకప్పటి ఆసిఫాబాద్ నియోజకవర్గ పరిధిలో బెల్లంపల్లి ఉన్న సమయంలో గుండా మల్లేష్ ఆరుసార్లు ఎమ్మెల్యే గా పోటీ చేశారు. బెల్లంపల్లి నియోజకవర్గం ఏర్పాటు తర్వాత 2009, 2014లో రెండుసార్లు సిపిఐ తరపున బరిలో నిలిచారు. ఇయన మొదట 1978లో తొలిసారిగా సిపిఐ నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దాసరి నర్సయ్య చేతిలో ఓడిపోయారు. అనంతరం 1983, 85, 94లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాడ్డాక 2009లో జరిగిన ఎన్నికల్లో మరోసారి గెలుపొందారు.

అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య చేతిలో ఓడిపోయారు. తరువాత 2019లో జరిగిన ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య చేతిలో మహాకూటమి నుండి పరాజయాన్ని చవిచూశారు. లారీ క్లీనర్ నుంచి సిపిఐ శాసనసభా పక్ష నేతగా ఎదిగిన గుండా మల్లేష్ ఎందరికో స్పూర్తి ప్రదాత. నిరాడంబరుడు, ఎలాంటి ఆస్తిపాస్తులు కూడబెట్టుకోని నేతగా పేరొందారు. సామాన్యులల్లో సామాన్యుడికి ఉండడం మల్లేష్ కే చెందింది.

- Advertisement -