కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ నేత, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కాంగ్రెస్ పార్టీ తన విధానం మార్చుకోకపోతే ఆ పార్టీతో కొనసాగుతున్న పొత్తును తెంచుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆశించిన విధంగా లేవని, కాంగ్రెస్ మిత్ర ధర్మం పాటించడం లేదని విమర్శించారు.
కొత్తగూడెం ఘటన తర్వాత సీపీఐ–కాంగ్రెస్ పార్టీల మధ్య విభేదాలు మరింత పెరిగాయని ఆయన తెలిపారు. ఈ విషయంపై త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మిత్రధర్మం విషయంలో స్పష్టత కోరనున్నట్లు చెప్పారు. సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో రాజకీయంగా వేరుగా ముందుకు వెళ్లే పరిస్థితి రావచ్చని సూచించారు.
అలాగే రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సీపీఐ ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమవుతోందని కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. రైతులకు అందాల్సిన రైతుబంధు సాయం కూడా ఆలస్యమవుతోందని ఆయన విమర్శించారు. ఇప్పటికే ఒక దఫా పెండింగ్‌లో ఉండగా, రెండవ దఫా చెల్లింపులకు కూడా సమయం మించిపోయిందన్నారు. ప్రభుత్వం రైతుబంధు ఇస్తుందా లేదా అనే విషయాన్ని స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఖమ్మం జిల్లాలోని భూదాన బాధితులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. హైదరాబాద్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Also Read:ప్రజల కోరిక మేరకే ‘కేరళం’గా మార్పు!
ఇక సింగరేణి సంస్థపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి పరిస్థితిపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

