ప్రాణం కాపాడినందుకు.. మొక్క నాటి థాంక్స్ చెప్పిన మహిళ

32
gic

ప్రభుత్వ దవాఖానాల్లో కరోనా చికిత్స కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.దేశంలో ఎన్నో చోట్ల ఆక్సిజన్‌ అందక, బెడ్లు దొరకక జనం పిట్టల్లా రాలిపోతుంటే.. తెలంగాణలో మాత్రం ప్రభుత్వ దవాఖానాలు ప్రజల ప్రాణాలు కాపాడుతున్నాయి. మొన్న గాంధీ దవాఖానాలో కరోనా వైద్యం పొంది.. పూర్తి ఆరోగ్యంతో తిరిగి వెళ్తూ.. గాంధీ దవాఖానాకు మొక్కిన ఓ మహిళ ఫొటో వైరల్ అయింది.

ఇప్పుడు తాజాగా.. గద్వాల్ లో కొవిడ్ తో బాధపడుతూ.. ప్రభుత్వ దవాఖానాలో చికిత్స పొందిన ఓ మహిళ కరోనా నుంచి కోలుకొని కృతజ్ఞతగా మొక్క నాటింది.హైదరాబాద్‌కు చెందిన సుజాత అనే మహిళ కరోనా సోకిందేమోననే అనుమానంతో దవాఖానలో టెస్టులు చేయించుకోవాలనుకుంది. హైదరాబాద్ దవాఖానాల్లో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఆక్సిజన్ దొరుకుతుందో లేదో అనే ఉద్దేశంతో తన పుట్టినిల్లయిన గద్వాలకు చేరుకుంది. స్థానిక జిల్లా దవాఖానలో చేరింది. ఆక్సిజన్, పడకలు అందుబాటులో ఉండడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా చికిత్స పొందింది. చికిత్స తర్వాత కరోనా పరీక్షల్లో నెగటివ్ గా తేలింది. డాక్టర్లు ఆమెను హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్ చేశారు.

తన ప్రాణాలు కాపాడిన ప్రభుత్వ దవాఖాన ఆవరణలో కృతజ్ఞతా భావంతో సుజాత ఒక మొక్కను నాటింది.ఆక్సిజన్ నిల్వలు లేక అనేక మంది చనిపోతున్న తరుణంలో ప్రభుత్వ దవాఖానలో తనకు చక్కని వైద్యం అందించినందుకు డాక్టర్లకు సైతం ఆమె ధన్యవాదాలు చెప్పింది. కరోనా వచ్చిందని తెలియగానే ఆందోళన చెంది జిల్లాల నుంచి హైదరాబాద్ పరుగు పెట్టుకు రావాల్సిన అవసరం లేదంటున్నది సుజాత. జిల్లాలోని ప్రభుత్వ దవాఖానాల్లో కూడా చక్కని వైద్యం అందుతోందని చెప్పింది.