దేశంలో మళ్లీ కొవిడ్-19 కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. కొత్త వేరియంట్ కేసులు నమోదవు తుండటం అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. ఇక కొవిడ్ కేసులతో దేశంలో ఇద్దరు మృతి చెందారు. మహారాష్ట్రలోని ఠాణెలో 21 ఏళ్ల యువకుడు మృతి చెందగా, బెంగళూరులో 84 ఏళ్ల వృద్ధుడు శనివారం ప్రాణాలు కోల్పోయారు.
అయితే మృతి చెందిన ఇద్దరికీ ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని అధికారులు తెలిపారు. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు.
మే నెలలో ఇప్పటివరకు ఒక్క కేరళలో అత్యధికంగా 273 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. ఢిల్లీలో 23 మందికి కరోనా సోకింది. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు కేసులు, తెలంగాణలో 1 కేసు నమోదయ్యాయి. కొత్తగా నమోదు అవుతున్న కేసుల్లో ఎన్‌బీ.1.8.1, ఎల్‌ఎఫ్.7 అనే రెండు కొత్త కొవిడ్ సబ్ వేరియంట్లను భారత్‌లో గుర్తించామని ఇండియన్ సార్స్ కరోనా వైరస్-2 జీనోమిక్స్ కన్సార్టియం (ఇన్సాకాగ్) వెల్లడించింది. ఎన్‌బీ.1.8.1 కొవిడ్ సబ్ వేరియంట్‌కు చెందిన ఒక కేసు ఏప్రిల్‌లో తమిళనాడులో బయటపడగా, ఎల్‌ఎఫ్.7 కొవిడ్ సబ్ వేరియంట్‌కు చెందిన నాలుగు కేసులు మేలో గుజరాత్‌లో నమోదైనట్లు ఇన్సాకాగ్ తెలిపింది.
Also Read:ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ

