మయన్మార్లో మరోసారి సైనిక తిరుగుబాటు జరిగిన సంగతి తెలిసిందే. గత నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలోని ఎన్ఎల్డీ భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. అయితే ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే మిలటరీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్డీ) నాయకురాలు, స్టేట్ కౌన్సిలర్ ఆంగ్ సాన్ సూకీతో పాటు దేశ అధ్యక్షుడు యు విన్మైంట్ను అదుపులోకి తీసుకుంది. ఏడాది పాటు పాలనను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు ఆ దేశ మిలటరీ ప్రకటించింది.
దీనికి కొనసాగింపుగా 400 మంది ఎంపీలను సైన్యం అదుపులోకి తీసుకుంది. వారందర్ని బంధించింది. దీంతో ఎంపీలు షాక్ అయ్యారు. ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని చెప్పి సైన్యం ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు. మయన్మార్ రాజధాని యంగూన్ లోని నేపిడా ప్రభుత్వ గృహంలో ఎంపీలు నిర్బంధంలో ఉన్నారు. నేపిడా ప్రభుత్వ గృహం చుట్టూ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
ఉపాధ్యక్షుడు మయంట్ స్వేనిని తాత్కాలిక అధ్యక్షుడిగా సైన్యం ప్రకటించింది. వెంటనే ఆయన అధికారాలను సైన్యాధ్యక్షుడు మిన్ ఆంగ్ లయాంగ్ కు బదిలీ చేశారు. అనంతరం మిన్ సైనిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 13 మంది మాజీ సైనికాధికారులతో కేబినెట్ కూడా ఏర్పాటు చేసుకున్నారు.