కార్పొరేట్ మాయాజాలం..వేసవి సెలవుల్లో తరగతులు..!

253
inter classes

ఇంటర్ బోర్డు నిబంధనలను తుంగలో తొక్కుతూ కార్పొరేట్ కాలేజీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలై 48 గంటలు గడవక ముందే వేసవి సెలవుల్లో తరగతులను నిర్వహిస్తూ పోతున్నారు. ఓ వైపు మండుతున్న ఎండలు మరోవైపు మార్చి 29 నుండి జూన్ 30 వరకు వేసవి సెలవులు కానీ ఇవేవి పట్టని కార్పొరేట్ కాలేజీలు విద్యను వ్యాపారం చేస్తూ తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్నారు.

ఇంటర్ ఫలితాల్లో ఒత్తిడిని తట్టుకోలేక పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా అవేవి పట్టని శ్రీచైతన్య,నారాయణ విద్యాసంస్థలు స్టూడెంట్స్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కోచింగ్‌లు,ప్రత్యేక తరగతులతో ఒత్తిడి తీసుకువస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మధ్యాహ్నం విద్యార్థులు బయటకు రాకుండా గేట్లకు తాళాలు వేసి మారి క్లాసులు చెబుతుండటం విశేషం.

వేసవి సెలవుల్లో ఏ కాలేజీ విద్యార్థులకు తరగతులు నిర్వహించకూడదు. ఒకవేళ నిర్వహిస్తే ఆ కాలేజీ గుర్తింపును రద్దు చేసే అవకాశం ఉంది. కానీ కొంతమంది అధికారులు కాలేజీ యాజమాన్యాల కాసులకు కక్కుర్తిపడి తరగతులు నిర్వహిస్తూనే ఉన్నారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించిన కళాశాలలు అనేకం ఉండగా, ఏ ఒక్క కళాశాల గుర్తింపును కూడా అధికారులు రద్దుచేయలేదు. హైదరాబాద్‌తో పాటు విజయవాడ, గుంటూ రు, విశాఖపట్నం తదితర నగరాల్లో పలు కాలేజీలు విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక నిబంధనలకు విరుద్దంగా వేసవి సెలవుల్లోనే ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు చేపడుతున్నారు. దీనిపై అధికారులు ఇప్పటికైనా స్పందించి ఆయా కాలేజీలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.