ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన ఓ మత కార్యక్రమం ఆరుగురిని బలి తీసుకుంది. వీరందరు కరోనాతో చనిపోయారని వైద్య ఆరోగ్య శాఖ ధృవీకరించింది. రెండురోజుల క్రితం ఖైరతాబాద్ ప్రాంతంలో చనిపోయిన వృద్ధుడు కూడా వీరిలో ఒకరు.
నిజాముద్దీన్ ప్రాంతంలోని ‘తబ్లిగి ఏ జమాత్’ మార్చి 1-15 మధ్య జరిగిన ఈ కార్యక్రమానికి విదేశాల నుంచి పలువురు హాజరయ్యారు. తెలంగాణతోపాటు పలు రాష్ర్టాల నుంచి వందలమంది ఇందులో పాల్గొన్నారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల ద్వారా వీరిలో పలువురికి కరోనా వైరస్ సోకినట్టు ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారి వివరాలను తమకు అందజేయాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చింది.
వీరిద్వారా వైరస్ సోకే అవకాశం ఉన్నదని భావిస్తున్న అనుమానితులను ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు గుర్తించి, దవాఖానలకు తరలిస్తున్నాయి. ఇప్పటికే అనుమానిత వ్యక్తులను నాలుగు ప్రధాన ఆస్పత్రుల్లో చేర్పించారు అధికారులు.
రాజీవ్ గాంధీ, ఎల్‌ఎన్‌జెపి, దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రిలో కరోనా అనుమానితులకు పరీక్షలు జరుపుతున్నారు. ఎల్‌ఎన్‌జెపిలో ఇప్పటివరకు 105 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరితో టచ్‌లో ఉన్న 300 మంది అనుమానితులను ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రికి తరలిస్తారనే సమాచారం.
ఇప్పటివరకు పరీక్షించిన 105 మంది నివేదికల కోసం అధికారులు వేచి చూస్తుండగా కరోనా సోకి మరణించిన తమిళనాడుకు చెందిన వ్యక్తి నిజాముద్దీన్ ప్రాంతంలోని మార్కాజ్ మసీదులో పలువురితో కలిసి తిరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కేసుల సంఖ్య గణనీయంగా పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు.
కోవిడ్ 19 నివారణకు అన్ని చర్యలు చేపడుతూ.. ఎటువంటి సామూహిక కార్యక్రమాలు చేపట్టకూడదని ఆదేశాలు జారీ చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన మసీదు మత పెద్దలపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.