తెలంగాణ ఉద్యమ ప్రస్థానం చిరస్థాయిగా నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ అమరజ్యోతి…మన గుండెల్లో నిలిచే విధంగా నిర్మించుకున్నామని అన్నారు. అమరుల పేరు ఎప్పుడూ మన మదిలో చిరకాలం నిలిచేలా నిర్మించామని అన్నారు. మొత్తం అమరవీరుల ఫోటోలను ప్రదర్శిస్తాం అని కేసీఆర్ తెలిపారు. ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్మారక కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు.
జై తెలంగాణ.. తెలంగాణ అమరవీరులకు జోహార్లు అంటూ కేసీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ రోజు రెండు పార్శ్వాలు కలగలిసి ఉన్నాయి. నిన్నటి దాకా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు సంతోషంగా జరుపుకున్నాం. ముగింపు సందర్భంలో చాలా ఘనంగా తెలంగాణ అమరులకు నివాళులర్పించాలని నిర్ణయించాం. దాంతోనే అమర జ్యోతి ప్రారంభం చివరి దశలో పెట్టుకున్నాం. మీరందరూ విచ్చేసి చేతుల్లో దీపాలు చేతబూని అమరలకు అర్థవంతమైన రీతిలో అంజలి ఘటించినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని కేసీఆర్ తెలిపారు.
మొట్టమొదట ఖమ్మం జిల్లా ఇల్లందులో ఓ ఉద్యమ పొలికేక రావడం, అక్కడ్నుంచి 1965, 1966 నుంచి మొదలుకొని 1967 నాటికి యూనివర్సిటీలకు చేరుకోవడం జరిగింది. చాలా ధైర్యంగా 58 ఏండ్ల సమైక్య రాష్ట్రంలో కూడా తమ అస్తిత్వాన్ని కోల్పోకుండా టీఎన్‌జీవోతో కొనసాగిన టీఎన్‌జీవోలు ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ ఉద్యమంలో ఆసాంతం ఉన్నారు. ఎన్నో రకాల కేసులు, వేధింపులు, భయంకరమైన పీడీ యాక్టులు, ఉద్యోగుల బర్తరఫ్‌లు, అనుభవించిన బాధలే ఇవాళ తెలంగాణ. ఆనాటి టీఎన్జీవో నేత ఆమోస్‌ను వీసా యాక్ట్ కింద పెట్టి ఉద్యోగాల్లో తీసేశారు అని కేసీఆర్ గుర్తు చేశారు.
Also Read: CMKCR: తెలంగాణలో ఒక ఎకరానికి ఆంధ్రాలో వందెకరాలు సమానం
1969 ఉద్యమం తర్వాత ఏం జరిగిందని జయశంకర్‌ను అడిగాం. కేసీఆర్ లాంటి వ్యక్తి రాకపోతడా అని చెప్పి మీటింగ్‌లకు వెళ్లి మాట్లాడేవాళ్లం అని చెప్పేవారు. తెలంగాణ ఉద్యమ సోయి బతికుండాలని ప్రయత్నాలు చేశామని చెప్పారు. లెఫ్ట్ పార్టీలు కూడా ఉద్యమానికి జీవం పోశాయి. ఉద్యమాన్ని సజీవంగా ఉంచేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయని కేసీఆర్ తెలిపారు. మలిదశ ఉద్యమంలో అనేక రకాల చర్చలు, వాదోపవాదాలు, హింస, పోలీసు కాల్పులు, ఉద్యమం నీరుగారిపోవడం వంటివి చూశాం అని కేసీఆర్ గుర్తు చేశారు.
Also Read: శంకరమ్మకు సముచిత పదవి!