వరుస పరాజయాలతో సతమతమవుతోన్న కాంగ్రెస్ పార్టీని నాయకత్వ సంక్షోభం కూడా వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ పూర్తిస్థాయి అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియను ఆగస్టు 21వ తేదీ నుంచి మొదలు పెట్టనున్నట్లు పార్టీ వర్గాలు సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీ చీఫ్ పోటీలో అగ్రనేత రాహుల్ గాంధీ ఉంటారా లేదా అనే విషయం మాత్రం తెలియరాలేదు. దీనిపై రాహుల్ గాంధీ కూడా మౌనంగానే ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్ష ఎన్నిక తర్వాత సీడబ్ల్యూసీతో పాటు పార్టీలోని ఇతర విభాగాలకు ఎన్నికలు జరగనున్నాయి.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ 2017లో బాధ్యతలు చేపట్టారు. అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 543 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ కేవలం 52 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఇలా కాంగ్రెస్ ఘోర పరాజయం కావడంతో అందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కరోనా తర్వాత కాలంలో జరిగిన ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల ఫలితాలు రావడంతో పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ ఏడాది మార్చి నెలలో ఏర్పాటు చేసిన పార్టీ జాతీయ సమీక్షా సమావేశంలో తనతో పాటు రాహుల్, ప్రియాంకా వాద్రా కూడా పార్టీలో తమ పదవులను వదులుకుంటామని ప్రకటించారు . ఆమె ప్రతిపాదనను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తిరస్కరించడంతో తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీనే కొనసాగుతున్నారు.