బిజెపిపై కాంగ్రెస్ ఎదురుదాడి
పథకాలు పాతవి, పేర్లు కొత్తవి
కాంగ్రెస్ పథకాలకు బిజెపి పేర్లు
కేటాయింపులు ఘనం-నిధుల విడుదల శూన్యం
పథకాలన్నీ అలంకారప్రాయమేనట
దేశాన్ని పాలించడంలో అధికార బిజెపి వైఫల్యాలను ఎండగట్టాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 2024లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే బి.జే.పి. బండారాన్ని ఎండగట్టాలని, అందుకు తగినట్లుగా కాంగ్రెస్ ప్రణాళికలను సిద్ధంచేసింది. పెరిగిన ధరలు, పెట్రో ఉత్పత్తుల ధరలు చుక్కలనంటిన వైనం, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం, బ్యాంకింగ్ సెక్టార్‌ను దివాళా తీయించిన విధానాలన్నింటినే కాకుండా ప్రభుత్వ పాలనాపరంగా చేసిన తప్పలను కూడా ఎండగట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమయ్యింది. అందులో భాగంగానే ఇప్పటికే అన్ని రాష్ట్రాల పి.సి.సి.లకు టాకింగ్ పాయింట్స్ ను కూడా పంపించినట్లు తెలిసింది. దేశ ప్రజల నుంచి పన్నులు, సెస్, సర్ చార్జీల రూపంలో లక్షలాది కోట్ల రూపాయలను వసూలు చేయడంతప్ప దేశానికి బిజెపి చేసిందేమీ లేదని, అన్ని పథకాలు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏర్పాటు చేసినవేనని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా ఎండగట్టే కార్యక్రమాన్ని చేపట్టింది.
దేశంలో ప్రజా సమస్యలను పరిష్కరించడానికి, కరువును పారద్రోలడానికి, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను మెరుగుపరచడానికి, నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పించడానికి మొత్తం 26 అభివృద్ధి, సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యు.పి.ఏ ప్రభుత్వం ఏర్పాటు చేసి విజయవంతంగా అమలుచేసిన పథకాలను రద్దు చేస్తున్నట్లుగానే చేసి వాటి పేర్లు మార్చిన నరేంద్రమోడీ ప్రభుత్వం కొత్తగా దేశ ప్రజలకు చేసిందేమీ లేదని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని చేపట్టింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేసి మోసాలను ప్రజలకు కూలంకషంగా తెలియజేయాలని కాంగ్రెస్ అధిష్టానం అన్ని రాష్ట్రాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక అనునిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు, ఆందోళనలు చేస్తూ ప్రజలతో మమేకం కావాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో యు.పి.ఏ.హయాంలో ఏర్పాటు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్తల పేర్లను పెట్టి అవే పథకాలను కొనసాగిస్తున్నారేగానీ కొత్తగా ఏర్పాటు చేసిందేమీ లేదనే అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అన్ని రాష్ట్రాల పి.సి.సి.లను, ఆయా రాష్ట్రాలకు పార్టీ ఇన్ చార్జీలను ఆదేశించింది.
అంతేగాక ఈ పథకాలకు బడ్జెట్లో ఎంతో ఘనంగా నిధుల కేటాయింపులు చూపిస్తూ వచ్చిన బిజెపి ప్రభుత్వం ఆచరణలో ఆయా పథకాలకు ఒక్క రూపాయి నిధులను విడుదల చేయడం లేదనే అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించిందని కొందరు పార్టీ నేతలు తెలిపారు. 2013 వ సంవత్స రంలోని కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని అప్పటి యు.పి.ఏ. ప్రభుత్వం ఎల్.పి.జి. సిలిండర్ల సబ్సిడీ బదిలీ పథకాన్ని పేరుమార్చివేసి ఇప్పడు పహల్ పథకంగా కొనసాగిస్తున్నారని, అదే విధంగా 2013లో గత యు.పి.ఏ. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిర్మల్ భారత్ అభియాన్ పథకాన్ని ఇప్పడు స్వచ్ఛ భారత్ మిషన్ గా నామకరణం చేశారని, 2013లోని జాతీయ పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ఇప్పుడు దీన్ దయాల్ అంత్యోదయ యోజనగా మార్చారని, 2011లోని జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ పథకాన్ని ఇప్పుడు భారత్ నెట్ గా, 2011లో బహుళ ప్రాచుర్యం పొందిన జాతీయ మ్యానుఫాక్చరింగ్ పాలసినీ ఇప్పుడు మేక్ ఇన్ ఇండియాగా పేరు మార్చారని, 2010లోని వచ్చిన ఇందిరా గాంధీ మాత్రిత్వ సయోగ్ యోజన పథకాన్ని ఇప్పుడు ప్రధానమంత్రిత్వ వందన యోజన పథకంగా మార్చారని కాంగ్రెస్ పార్టీ నాయకులు వివరించారు. 2010లోని స్వావలంబన యోజన పథకాన్ని ఇప్పడు అటల్ పెన్షన్ యోజనగా పేరు మార్చారని, 20 10లోని జాతీయ స్కిల్ డవలప్ మెంట్ ప్రోగ్రాంకు ఇప్పడు స్కిల్ ఇండియాగా పేరు మార్చారని, 2010లో వచ్చిన బీపీఎల్ కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ పథకాన్ని పేరు మార్చి ఇప్పడు పీఎం ఉజ్వల్ యోజనగా, 2010లోని వచ్చి జాతీయ పంటల బీమా పథకాన్ని పేరుమార్చి ఇప్పుడు ఫసల్ భీమాగా మార్చారని, ఇళ్ళులేని పేదలకు ఉచితంగా ఇళ్ళను నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2009లో రాజీవ్ ఆవాస్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని, కోట్లాది మంది దేశ ప్రజలకు ఇళ్ళను నిర్మించి ఇచ్చిందని, ఆ పథకాన్ని పేరు మార్చి ఇప్పడు సర్దార్ పటేల్ నేషనల్ మిషన్ ఫర్ అర్బన్ హౌసింగ్ గా మార్చారని, 2008లో జాతీయ బాలికల డే పథకాన్ని పేరు మార్చి బేటీ బచావో- బేటీ పడావో అనే పేరుతో పిలుస్తున్నారని, 2008లో యు.పి.ఏ. ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసార పరీక్షల పథకం పేరు మార్చి ఇప్పడు భూసార కార్డు పథకంగా చేశారని, 2008లో తెచ్చిన జన ఔషది పథకానికి పేరు మార్చి ఇప్పడు పీఎం భారతీయ జన ఔషది పరియోజనగా నామకరణం చేశారని, దేశంలో నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేయడానికి, ప్రాజెక్టులు నిర్మించుకునే రాష్ట్రాలకు ఆర్ధికంగా సహకరించేందుకు 2007లో వచ్చిన ఇరిగేషన్ బెనిఫిట్ పోగ్రాం (ఎఐబిపి)ను ఇప్పడు పీఎం క్రిషి సించాయ్ యోజనగా మార్చారని, 2007లో ప్రవేశపెట్టిన ఆమ్ ఆద్మీ భీమా యోజన పథకానికి పేరు మార్చి ఇప్పుడు వీఎం సురక్షా భీమా యోజనగా పేరు మార్చారని, 2006లో సంచలనాత్మకంగా ప్రవేశపెట్టిన నేషనల్ ఈ-గవరైన్స్ ప్లాన్ పథకానికి ఇప్పుడు డిజిటల్ ఇండియాగా పేరు మార్చారని, నేషనల్ మారీ టైం డవలప్మెంట్ ప్రోగాంను ఇప్పుడు సాగర్ మాలా పథకంగా రూపాంతరం చెందిందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడం కోసం 2005లో ప్రవేశపెట్టిన అజ్వికా-నేషనల్ రూరల్ లైబ్లీహుడ్ మిషన్ పేరును ఇప్పుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ యోజన పథకంగా పేరు మార్చారు. దేశంలో కరెంటులేని గ్రామాలు ఉండకూడదని, అన్ని గ్రామాలకూ విద్యుద్దీకరణ సదుపాయాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో 2005లో రాజీవ్ గాంధీ గ్రామీణ్ విద్యుద్దీకరణ యోజన పథకాన్ని ప్రవేశపెట్టగా ఇపుడు దాని పేరును మార్చివేసి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజనగా అమలుచేస్తున్నారని తెలిపారు. 2005లో ప్రవేశపెట్టిన జవహార్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ పథకాన్ని ఇప్పడు అమృత్ పథకంగా పేరు మార్చారని, అదే విధంగా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ పథకాన్ని ఇప్పడు జన్ ధన్ యోజనగా మార్చారని, అంతేగాక డవలప్ మెంట్ ఆఫ్ హెరిటేజ్ ఏరియాస్ పథకాన్ని ఇప్పుడు ఊదయ్ పథకంగా మార్చారని కాంగ్రెస్ శ్రేణులు ఆక్షేపిస్తున్నాయి. అదే విధంగా దేశంలో వివిధ వైరస్లు, వ్యాధులకు ఉచితంగా టీకాలిచ్చి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలనే ఉద్దేశ్యంతో 1985వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగాంను రద్దుచేసి, పేరు మార్చి ఇప్పడు మిషన్ ఇంద్రధనుష్ గా పిలుస్తున్నారని, 1985లో ఏర్పాటు చేసిన ఇందిరా ఆవాస్ యోజన పథకాన్ని ఇప్పడు పీఎం గ్రామీణ్ అవాస్ యోజనగా మార్చారని తెలిపారు. జాతీయస్థాయిలోనే కాకుండా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన, ప్రపంచ బ్యాంకు సైతం కితాబిచ్చిన ఐ.సి.డి.ఎస్.పథకం పేరును మార్చి ఇప్పుడు ఫోషన్ అభియాన్ గా నామకరణం చేసి కొనసాగిస్తున్నారని వివరించారు. ఇలా కాంగ్రెస్ పార్టీ, యు.పి.ఏ. ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసి దేశంలో విజయవంతంగా అమలుచేసి ప్రజల మన్ననలను పొందిన సంక్షేమ పథకాలను రద్దు చేసినట్లుగా చేసి పేరు మార్చి అవే పథకాలను అమలుచేస్తున్నట్లుగా ప్రకటించిన బి.జె.పి. ప్రభుత్వం ఈ పథకాలకు అవసరమైన నిధులను కూడా కేటాయించకుండా, కేటాయించిన నిధులను మంజూరు చేయకుండా దేశ ప్రజలను వేధింపులకు గురిచేస్తోందని, ఈ పథకాలను అలంకారప్రాయంగానే కొనసాగిస్తున్నారని ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ అంశాలను దేశ ప్రజల్లో ముమ్మరంగా తీసుకెళతామని అంటున్నారు.