Congress:ఖమ్మంలో కాంగ్రెస్..సస్పెన్స్!

32
- Advertisement -

లోక్ సభ ఎన్నికల వేళ ఖమ్మం సీటు కాంగ్రెస్ ను కలవర పెడుతోంది. 17 లోక్ సభ స్థానాలకు గాను ఇప్పటికే 13 అభ్యర్థులను కన్ఫర్మ్ చేసిన కాంగ్రెస్ మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఎంచుకునేందుకు ఆపసోపాలు పడుతోంది. ముఖ్యంగా ఖమ్మం సీటు విషయంలో ఎదురవుతున్న చిక్కులు హస్తం పార్టీని గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఖమ్మం పార్లమెంట్ సీటు కోసం పార్టీలోని కీలక నేతలు.. డిప్యూటీ సి‌ఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వంటి వారు గట్టిగా పోటీ పడుతున్నారు. భట్టి విక్రమార్క తన భార్యకు టికెట్ తెచ్చుకునే ప్రయత్నంలో ఉండగా, పొంగులేటి తన తమ్ముడి కోసం, తుమ్మల తన కుమారుడి కోసం ఈ సీటుపై కన్నేసినట్లు తెలుస్తోంది. ముగ్గురు కీలక నేతలే కావడంతో టికెట్ కేటాయించే విషయంలో అధిష్టానం కూడా తలపట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఎవరికి సీటు కేటాయించిన మరో ఇద్దరు నేతల నుంచి ఎంతో కొంత వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. అందుకే ఈ సీటు పంచాయతిని తెల్చేందుకు రేవంత్ రెడ్డి పై భారం వేసినట్లు వినికిడి. సి‌ఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే నేతలతో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. నేడు జరిగే తుక్కుగూడ జనజాతర సభలో ఖమ్మం సీటుతో పాటు పెండింగ్ లో ఉన్న మూడు సీట్ల యొక్క అభ్యర్థులను ప్రకటించే అవకాశం లేకపోలేదు. కాగా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఖమ్మం సీటును భట్టి విక్రమార్క భార్యకే కట్టబెట్టేందుకు కాంగ్రెస్ అడుగులు వేస్తోందట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అటు బి‌ఆర్‌ఎస్ నుంచి నామ నాగేశ్వరరావు, బీజేపీ నుంచి తాండ్ర వినోద్ రావు పోటీ బరిలో ఉన్నారు. ఎటొచ్చీ కాంగ్రెస్ లో మాత్రమే ఈ సీటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. మరి 2019 లోక్ సభ ఎన్నికల్లో కేవలం మూడు సీట్లతోనే సరిపెట్టుకున్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు సొంతం చేసుకుంటుందో చూడాలి.

Also Read:Congress:కాంగ్రెస్ జన జాతర సభ

- Advertisement -