ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటించింది. ఓ వైపు సీట్లు ఆశీస్తున్న వారి నిరసనలు,ఆందోళనలో నేపథ్యంలో అర్థరాత్రి తొలిజాబితాను విడుదల చేసిన కాంగ్రెస్ నేతలకు అసంతృప్తులను బుజ్జగించడం కత్తిమీద సాములా మారింది. ముఖ్యంగా తొలిజాబితాలో సీటు ఆశీంచిన సీనియర్ లీడర్లు పొన్నాల,మర్రి శశీధర్ రెడ్డి,విష్ణువర్ధన్ రెడ్డిలకు నిరాశే ఎదురైంది.
మరోవైపు సీటు ఆశించి భంగపడ్డ వారిలో కొంతమంది పార్టీకి గుడ్ బై చెప్పగా మరికొంతమంది రెబల్ అభ్యర్థులుగా నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక్కడి నుంచి పైలెట్ రోహిత్ రెడ్డికి టికెట్ కేటాయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన పార్టీని నమ్ముకున్న నాయకులను నిలువునా మోసం చేశారని మండిపడ్డారు.
మెదక్ సీటును టీజేఎస్‌కు కేటాయిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో టీపీసీసీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ళ శశిధర్‌రెడ్డి ఈ నెల 14న నామినేషన్ వేయనున్నట్టు ప్రకటించారు. 2004లో కూడా తాను ఇండిపెండెంట్‌గా గెలుపొందిన విషయాన్ని గుర్తుచేసిన ఆయన బరిలో ఉండి తీరుతానని తెలిపారు.
మహబూబ్‌నగర్ నియోజకవర్గాన్ని పొత్తుల్లో భాగంగా టీడీపీకి కేటాయించడంపై స్థానిక నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం ఉదయం పార్టీ కార్యాలయం వద్ద నిరసనకు దిగిన కార్యకర్తలు.. డీసీసీ కార్యాలయానికి తాళం వేసి, గేటు ఎదుట బైఠాయించారు.
కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని 28 ఏండ్లుగా జెండా మోస్తూ పార్టీ అభివృద్ధికి కృషిచేస్తుంటే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కక్ష సాధింపు ధోరణితో సీట్లను అమ్ముకుంటూ తనకు అన్యాయం చేశారని ఆరోపించారు గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి అయన కాంగ్రెస్ రెబల్‌గా నామినేషన్ దాఖలుచేశారు.
ఉత్తమ్ దంపతులను ఓడించేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు టీడీపీ ప్రధానకార్యదర్శి బొల్లం మల్లయ్య యాదవ్. తన స్వార్థం కోసం ఎవరినైనా బలి పశువులను చేసే నైజం ఉత్తమ్‌దన్నారు.