గులాబీ గూటికి కాంగ్రెస్ సీనియర్లు..!

87
congress
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రాజీనామా ఉదంతం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్లు బుజ్జగించడంతో కాస్త మెత్తపడ్డ జగ్గారెడ్డి తన రాజీనామా లేఖను సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు పంపారు. తన రాజీనామాపై 15 రోజులు వెయిట్ చేస్తానని, అప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ స్పందించకపోతే తుది నిర్ణయం తీసుకుంటానని హెచ్చరించారు. కాగా తెలంగాణ కాంగ్రెస్‌లో జగ్గారెడ్డి సంక్షోభం కొనసాగుతుండగానే..మరో కాంగ్రెస్ సీనియర్ నేత, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు హస్తం వీడి గులాబీ గూటికి చేరడం ఖాయమని స్వయంగా టీఆర్ఎస్ నేత, పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ పుట్ట మధు సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాగా గత కొంత కాలంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో విబేధాల నేపథ్యంలో మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. రేవంత్‌రెడ్డిపై కోమటిరెడ్డి, వెంకటరెడ్డిలా దుద్దిళ్ల పెద్దగా వ్యాఖ్యలు చేయకపోయినా… పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో దుద్దిళ్ల ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహించి టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకు సహకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల ఏపీ మంత్రి బొత్స కుమారుడి మ్యారేజీ ఫంక్షన్‌లో మంత్రి కేటీఆర్‌తో దుద్దిళ్ల శ్రీధర్ బాబు ..ఒకే చోట కూర్చుని సన్నిహితంగా మాట్లాడడంతో ఆయన త్వరలో టీఆర్ఎస్‌లోకి జంప్ అవుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

అయితే తాజాగా దుద్ధిళ్ల శ్రీధర్‌బాబుపార్టీ మార్పుపై ఆయన రాజకీయ ప్రత్యర్థి పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్, పుట్ట మధు స్పందించారు. సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ తలుపులు తెరిస్తే మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు గాలాబీ కండువా కప్పుకోవడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దపల్లి జిల్లా పరిషత్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పుట్ట మధు మాట్లాడుతూ .. దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతోందని, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని ఫైర్ అయ్యారు. టిఆర్ఎస్‌లో చేరడానికి శ్రీధర్ బాబు సిద్ధంగా ఉన్నా …ఎం కేసీఆర్ మాత్రం గేటు తెరవడం లేదని పుట్టమధు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పటికైనా నిజాన్ని గ్రహించి చెంచాగిరి చేయడం మానుకోవాలని చురకలంటించారు. కాగా 2018 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే పుట్టమధుపై శ్రీధర్‌బాబు విజయం సాధించిన సంగతి తెలిసిందే.అయితే దుద్దిళ్ల కారెక్కడం ఖాయమని వార్తలు వస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆయనకు గేట్లు తెరవడం లేదంటూ పుట్టమధు చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారాయి. మొత్తంగా జగ్గారెడ్డితో పాటు మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ వస్తున్న వార్తలు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి షాకుల మీద షాకులు ఇస్తున్నాయనే చెప్పాలి. ఒక వేళ అనుకున్నట్లుగానే దుద్దిళ్ల కారెక్కితే పుట్టమధు తన దారి తాను చూసుకుంటారా లేదా…ఆయనతో కలిసిపోయి సర్దుకు పోతారా అనేది చూడాలి.

- Advertisement -