కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేక పవనాలు..

118
Congress
- Advertisement -

కాంగ్రెస్‌ పార్టీ దేశంలో రోజు రోజుకు ప్రభావాన్ని కోల్పోతోంది అనడంలో ఎటువంటి సందేహం లేదనే చెప్పాలి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. రాహుల్‌ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ ఇప్పట్లో కోలుకుని పూర్వ వైభవాన్ని సొంతం చేసుకుంటుందా అంటే కష్టమనే చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పార్టీ పరంగానే కాదు.. ఆదాయం పరంగా కూడా కాంగ్రెస్‌ పార్టీకి గట్టిదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ పార్టీ ఆదాయం 2020-21లో రూ.285.76 కోట్లకు పడిపోయింది. అయితే 2019-20లో రూ.682.21 కోట్ల ఆదాయం గడించింది. ఎన్నికల సంఘానికి ఇచ్చిన వార్షిక ఆదాయ వ్యయాల నివేదికలో ఈ వివరాలను కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. 2019-20లో రూ.998 కోట్లు ఖర్చు చేయగా 2020-21లో వ్యయాలు రూ.209 కోట్లకు పడిపోయాయి.

కాగా, 2020-21లో ఏఐసీసీ సభ్యులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మద్దతుదారుల నుంచి ఎలాంటి విరాళాలు స్వీకరించలేదని కాంగ్రెస్‌ పార్టీ తెలిపింది. అయితే ఎన్నికల బాండ్ల రూపంలో రూ.10.07 కోట్లు, కంపెనీల నుంచి రూ.24.46 కోట్ల విరాళాలు, ఎన్నికల ట్రస్ట్‌ల నుంచి రూ.7.36 కోట్లు అందినట్లు పేర్కొంది. 2019-20లో కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి రూ.29.67 లక్షలు, సానుభూతిపరుల నుంచి రూ.52,000, ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రూ.317.86 కోట్లు వచ్చాయి. కంపెనీల దాతల నుంచి రూ. 94.02 కోట్లు, ఎలక్టోరల్ ట్రస్టుల నుంచి కోటి రూపాయలు అందాయి. 2019-20లో రూ.864 కోట్లు వ్యయం ఉండగా 2020-21లో రూ.91.35 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మరోవైపు ప్రోగ్రెస్‌లో ఉన్న హెడ్ క్యాపిటల్ వర్క్స్ (CWIP) కింద 2019-20లో రూ. 169 కోట్లు, 2020-21లో రూ.207.95 కోట్లు కాంగ్రెస్‌ పార్టీ ఖర్చు చేసింది.

ఢిల్లీలోని రూస్ అవెన్యూలో నిర్మిస్తున్న కొత్త పార్టీ కార్యాలయం కోసం ఈ మేరకు ఖర్చు చేసినట్లు తెలుస్తున్నది. ఒక వైపు తన ప్రత్యర్ధి పార్టీ బీజేపీ దేశవ్యాప్తంగా పుంజుకుని పట్టిష్టంగా మారగా.. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం దేశ వ్యాప్తంగా ఢీలా పడిపోవడమే కాకుండా.. ఆదాయంలో కూడా బీజేపీకి ఆమడా దూరంలో ఉంది. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి ఆదాయం భారీగా తగ్గడంలో అనేక కారణాలు ఉన్నా.. ఆ పార్టీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు దగ్గరలో కనిపించడంలేదు. నానాటికి దిగజారుతున్న పార్టీ ప్రాభవాన్ని తిరిగి పొందడంలో కాంగ్రెస్‌ నాయకత్వం తీవ్రంగా శ్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్‌ పార్టీ.. ఇప్పుడిలా జీవచ్చవం లేని పార్టీగా అంథపాతాలానికి పడిపోవడాన్ని ఆ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ పార్టీకి తిరిగి పునర్‌ వైభవాన్ని కల్పించడానికి కృషి చేయాలని కోరుతున్నారు.

- Advertisement -