Congress:కాంగ్రెస్ ‘బిగ్ మిస్టేక్స్’!

22
- Advertisement -

దేశ రాజకీయాల్లో అత్యంత బలమైన పార్టీగా, అతిపెద్ద పార్టీగా స్వాతంత్య్రానికి ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలకు ధీటుగా ప్రజాకర్షణ కలిగిన పార్టీగా పేరు తెచ్చుకుంది. అయితే గత కొన్నాళ్లుగా ఆ పార్టీ చాలా బలహీన పడిందనే చెప్పాలి. ముఖ్యంగా 2014 లో అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. అంతర్గత కుమ్ములాటలు, సొంత నేతల నుంచే వ్యతిరేకత, ఆయా సందర్భాల్లో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు.. ఇలా చాలా అంశాలు పార్టీని గట్టిగా దెబ్బ తీశాయి. దాంతో అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పూర్వ వైభవం కోసం పాకులాడుతూనే ఉంది.

పైగా చాలా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు బలపడడం కూడా కాంగ్రెస్ ను దెబ్బ తీసిన పరిణామాల్లో ఒకటి. ఒక విధంగా చెప్పాలంటే ఆయా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీనే జీవం పోషిందనే చెప్పవచ్చు. 1998 లో పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్, 1999 లో మహారాష్ట్రలో ఎన్సీపీ, 2011 లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇలా ఆయా పార్టీలు పురుడు పోసుకోవడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కాంగ్రెస్ పార్టీనే కారణం. ఏపీ కి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత వైస్ జగన్ కు కాంగ్రెస్ లో సముచిత స్థానం కల్పించి ఉంటే అసలు వైసీపీనే ఏర్పడేది కాదు. అలా జరగకపోవడం వల్ల కాంగ్రెస్ లో ఇమడలేని జగన్మోహన్ రెడ్డి సొంతంగా పార్టీ పెట్టడంతో ఏపీ కాంగ్రెస్ నేతలంతా మూకుమ్మడిగా వైసీపీలో చేరారు.

ఫలితంగా ఇప్పుడు ఏపీలో హస్తం పార్టీ పరిస్థితి ఎంత ధీనంగా ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇక తెలంగాణలో సైతం అప్పటి టి‌ఆర్‌ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే దిశగా ప్రయత్నాలు జరిగాయనే టాక్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. నిజానికి టి‌ఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయిఉంటే.. ఇప్పుడు తెలంగాణ రాజకీయ ఇంకోలా ఉండేవి. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ఇదే తప్పులు చేయడంతో స్థానిక పార్టీలు ఉద్భవించాయి. ఇక ఇప్పుడు చాలా రాష్ట్రాలలో స్థానిక పార్టీలే కాంగ్రెస్ ను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. మరి గత పరిణామాల దృష్ట్యా ఘోరంగా దెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం అన్నీ విధాలుగా ప్రయత్నిస్తోంది. మరి ఆ పార్టీకి మునుపటి రీతిలో బలపడుతుందో లేదో చూడాలి.

Also Read:Rohith:రోహిత్ రిటైర్మెంట్ అప్పుడే!

- Advertisement -