గులాబీ ఆకర్ష్‌తో తలలు పట్టుకుంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగ కాంతారావు,హరిప్రియ నాయక్,ఉపేందర్ రెడ్డి,సబితా ఇంద్రారెడ్డి,చిరుమర్తి లింగయ్య,సుధీర్ రెడ్డి,జాజుల సురేందర్,ఆత్రం సక్కు టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించగా మరో ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా పార్టీమారేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు ,జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీతక్క తదితరులు కూడా జాబితాలో ఉన్నారని విస్తృత ప్రచారం జరుగుతోంది. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి టీఆర్‌ఎస్ టికెట్‌తో తిరిగి పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటిస్తున్నారు.
రోజుకో ఎమ్మెల్యే పార్టీ వీడి కారెక్కేందుకు సిద్ధమవుతుండటంతో హస్తం నేతలకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో భంగపడ్డ కాంగ్రెస్‌కు.. టిఆర్‌ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కనీసం ఐదుగురైనా కాంగ్రెస్‌లో మిగులుతారా అన్న సందేహం నెలకొంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 19 సీట్లలో గెలుపొందింది. అందులో ఇప్పటికే ఎనమిది మంది ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారు. మిగిలిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు కాంగ్రెస్‌ను వీడుతారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోతుంది. తెలంగాణ తొలి ప్రభుత్వంలో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు 15 మందిలో 12 మంది టిఆర్‌ఎస్‌ఎల్‌పీలో విలీనమయ్యారు. ఇటీవల శాసన మండలిలో కాంగ్రెస్ సభాపక్షం టిఆర్‌ఎస్‌ఎల్‌పీలో విలీనమైంది. ఇప్పుడు ఇదే విలీన వ్యూహాన్ని శాసనసభలోనూ అమలు చేయనున్నారని తెలుస్తోంది.