టీఆర్ఎస్‌లోకి కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డి..!

137
ktr

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దాదాపు ఖాళీ అయ్యే పరిస్ధితి నెలకొంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌ను వీడగా తాజాగా మరో ఎమ్మెల్యే సైతం కారెక్కేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి త్వరలో టీఆర్ఎస్‌లో చేరనున్నారని సమాచారం.

సీఎం కేసీఆర్‌తో ఏకాంత చర్చలు జరిపిన హర్షవర్థన్ టీఆర్ఎస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్ధానాలుండగా 13 స్ధానాల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేసింది. కేసీఆర్ సునామీ ధాటికి రేవంత్,డీకే అరుణ,సంపత్,వంశీచంద్ లాంటి కాంగ్రెస్ నేతలు పరాజయం పాలయ్యారు.

అయితే ఒకే ఒక్క స్ధానం కొల్లాపూర్‌ను మాత్రమే కాంగ్రెస్ కాపాడుకోగలిగింది. ఇప్పుడు ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా గులాబీ గూటికే చేరనుండటంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్‌ ప్రాతినిధ్యం లేకుండా పోయింది.

ఇప్పటివరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు,హరిప్రియా నాయక్,చిరుమర్తి లింగయ్య,సబితా ఇంద్రారెడ్డి,కందాడి ఉపేందర్ రెడ్డి,వనమా వెంకటేశ్వరరావు,రేగా కాంతారావు,సుధీర్ రెడ్డి,జాజుల సురేందర్ టీఆర్ఎస్‌లో చేరుతామని ప్రకటించారు. వీరితో పాటు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సైతం త్వరలో టీఆర్ఎస్‌లో చేరుతామని ప్రకటించిన సంగతి తెలిసిందే.