డీకే అరుణ బాటలోనే కాంగ్రెస్ నేతలు..!

286
dk aruna
- Advertisement -

అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఫలితాలతో కోలుకోలేని దెబ్బతగిలిన కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఓ వైపు గులాబీ ఆకర్ష్‌లో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరుతుండగా సీనియర్ నేతలు సైతం అదేబాటలో పయనిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మాజీ మంత్రి,మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత డీకే అరుణ కాంగ్రెస్ పార్టీని వీడారు. బీజేపీ చీఫ్ అమిత్‌ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన డీకే అరుణ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డి చేతిలో పరాజయం పొందారు. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా అదృష్టాన్ని పరిక్షించుకోబోతున్నారు.

ఇక డీకే అరుణ బాటలోనే పయనించేందుకు మరికొంతమంది సీనియర్ నేతలు సిద్ధమవుతున్నారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్‌ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్‌ రెడ్డి కూడా కాషాయ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.

వాస్తవానికి నిన్ననే బీజేపీ అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామని చెప్పినా.. తాజా సమీకరణాల నేపథ్యంలో అది వాయిదా పడింది. టీఆర్ఎస్ లిస్టు వచ్చాకే బీజేపీ తమ అభ్యర్థుల్ని ప్రకటించబోతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లో టికెట్లు దక్కని అసంతృప్త నేతల్ని తమవైపు తిప్పుకోవడం ద్వారా ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. ఇందుకోసం బీజేపీ నేత రాంమాధవ్ క్షేత్రస్ధాయిలో వ్యూహాలు రచిస్తున్నారు. మొత్తంగా కాషాయ నేతల వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో వేచిచూడాలి.

- Advertisement -