నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండలానికి చెందిన కాంగ్రెస్ జడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్,పలువురు కాంగ్రెస్ నాయకులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి మంత్రి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు రేండ్ల రవికి మంత్రి టిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజక పాలన, బడుగుబాలహీన వర్గాల అభివృద్ధి కోసం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ఇవాళ టిఆర్ఎస్‌లో వివిధ పార్టీల నుంచి జాయిన్ అవుతున్నారు. ఇందులో భాగంగా ఏర్గట్ల జడ్పీటీసీ సభ్యులు గుల్లె రాజేశం టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి హృదయ పూర్వక స్వాగతం పలుకుతున్నాను.వారు ఏదైతే మండల అభివృద్ధి కోరి పార్టీలో చేరారో వారి నమ్మకాన్ని నిజం చేస్తాం.అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం నీళ్లు బీడు భూములకు మళ్లించి పంటలు సమృద్ధిగా పండేటట్లు చేశారు. సీఎం కేసీఆర్ రైతు బాగు కోసం పని చేస్తారు. రైతులు పండించిన పంటను మంచి ధరకు అమ్ముకునే విధంగా సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వరి ధాన్యం, మక్కలు, ఎక్కువ పండిస్తే రానున్న రోజుల్లో డిమాండ్ తగ్గి మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రారు.
రైతులు లాభసాటి పంటల వైపు మొగ్గు చూపాలి. కేసీఆర్ గత రెండు,మూడు రోజులుగా నియంత్రిత వ్యవసాయంపై సమగ్ర ఆలోచన చేస్తున్నారు. ముఖ్యమంత్రి చెప్పినట్లు రైతులు లాభసాటి పంటల వైపు మొగ్గు చూపాలని, ఆ వైపు ఆలోచన చేయాలని కోరుతున్నాను. అని మంత్రి అన్నారు.