త్వరలో టీఆర్ఎస్‌‌లోకి జానారెడ్డి..?

124
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అతి పెద్ద సంచలన చోటు చేసుకోబోతుందా…టీపీసీసీ రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య కలహ‍ాల కథ క్లైమాక్స్‌కు చేరిందా..కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి టీడీపీ – 2 గా మారుస్తున్నాడని ఆగ్రహిస్తున్న సీనియర్లు ఇక ఒక్కొక్కరుగా హస్తం పార్టీని వీడనున్నారా…కాంగ్రెస్ కురు వృద్ధుడు జానారెడ్డి త్వరలో టీఆర్ఎస్‌లో చేరబోతున్నారా…జానా నిష్క్రమణతో కాంగ్రెస్ పార్టీ కుప్పకూలనుందా..ప్రస్తుతం హస్తం పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేతల్లో జానారెడ్డి అగ్రస్థానంలో నిలుస్తారు. దశాబ్దాలుగా తెలంగాణ రాజకీయాల్లో హుందాగా వ్యవహరించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అంతా జానారెడ్డి పేరు చెబుతారు.

సైద్ధాంతిక పరమైన విమర్శలు తప్పా…తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడు వ్యక్తిగత దూషణలకు దిగజారని ఏకైక నేత జానారెడ్డి. తెలంగాణ ఉద్యమ సమయంలో స్వరాష్ట్ర ఆకాంక్షను గట్టిగా వినిపించిన కాంగ్రెస్ నేతల్లో జానారెడ్డి ముందుంటారు. కేసీఆర్‌తో కలిసి జేఏసీ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. సీఎం కేసీఆర్ సైతం పెద్దలు జానారెడ్డి అంటూ సంబోధిస్తూ గౌరవిస్తుంటారు. వ్యక్తిగతంగా జానారెడ్డిని ఎంతగానో అభిమానించే సీఎం కేసీఆర్ సాగర్ ఉప ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థిగా ఓడించకతప్పలేదు. సాగర్ ఉప ఎన్నికల్లో ఓటమితో జానా పెద్దగా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో కనిపించడం లేదు. దాదాపుగా ఇంటికే పరిమితం అవుతున్నారు. ఓ రకంగా జానా ఓటమి రేవంత్‌ రెడ్డికి పీసీసీ పదవి దక్కేలే చేసింది. అదే సాగర్‌లో జానా గెలిచివుంటే ఆయనకే పీసీసీ పీఠం దక్కేది..ఆయనే కాంగ్రెస్ సీఎం క్యాండిడేట్ అయ్యేవారన్నది నిజం. కాగా వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తుందని ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉన్న రేవంత్రెడ్డి సీఎం పదవికి పోటీ లేకుండా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ సీనియర్ నేతలను పక్కనపెడుతున్నాడు. టీడీపీ నుంచి వచ్చిన నేతలకు ప్రియారిటీ ఇస్తూ కాంగ్రెస్ సీనియర్లు అయిన కోమటిరెడ్డి బ్రదర్స్, జగ్గారెడ్డి, కొండా దంపతులు, మల్లు భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి వంటి నేతలను మెల్లగా పొమ్మనలేక పొగబెడుతూ పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని గాంధీభవన్‌లో టాక్ నడుస్తోంది.

ఈ క్రమంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూసి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కలత చెందుతున్నారు. ఇటీవల జగ్గారెడ్డి సీఎల్పీ కార్యాలయంలో రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకమాండ్ పెద్దలు జానారెడ్డితో సహా సీనియర్ నేతలకు క్లాస్ తీసుకుంది..పార్టీలో ఉంటే ఉండండి..పీసీసీ చీఫ్‌ను వ్యతిరేకించే వాళ్లంతా వెళ్లిపోవచ్చు అంటూ వార్నింగ్ ఇవ్వడంతో పెద్దాయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కాగా సాగర్ ఉప ఎన్నికలకు ముందు జానారెడ్డి తన కుమారుడితో సహా బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. కాని సెక్యులర్ వాది అయిన జానా మతతత్వ బీజేపీలో చేరేందుకు ఇష్టపడడం లేదంట…దీంతో కుటుంబసభ్యులు టీఆర్ఎస్‌లో చేరమని గత కొంత కాలంగా వత్తిడి చేస్తున్నారంట…రేవంత్ ఎంత ప్రయత్నించినా కాంగ్రెస్ అధికారంలోకి రాదని, వచ్చేసారి కూడా టీఆర్ఎస్‌దే అధికారమని జానా భావిస్తున్నారంట… టీఆర్ఎస్ లో చేరితే తమకు రాజకీయ భవిష్యత్ ఉంటుందని ఆయన కుమారులతో సహా కుటుంబసభ్యులు నచ్చచెబుతున్నారంట.

కేసీఆర్ వచ్చేసారి జాతీయ రాజకీయాలకు వెళతారని, కాలం కలిసి వస్తే సంకీర్ణ ప్రభుత్వం వస్తే కేంద్రమంత్రి అయినా కావచ్చని, లేదా రాజ్యసభ సభ్యుడిగానే, గవర్నర్ గానో అవకాశం రావచ్చని జానాకు కుటుంబసభ్యులు చెబుతున్నారంట…దీంతో ఓ పక్క కాంగ్రెస్‌ను వీడాలని లేకున్నా….కుటుంబ సభ్యుల కోరిక మేరకు జానారెడ్డి టీఆర్ఎస్ వైపు చూస్తున్నారని టాక్ విన్పిస్తోంది. సీఎం కేసీఆర్ తనకు స్పష్టమైన హామీ ఇస్తే ఆయన ఏ సమయంలోనైనా టీఆర్ఎస్ చేరే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మొత్తంగా సీనియర్ నేత జానారెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు వస్తున్న వార్తలు నిజమైతే రేవంత్ రెడ్డికి అతి పెద్ద దెబ్బే అని చెప్పాలి. జానా నిష్క్రమిస్తే ఆయన బాటలో కాంగ్రెస్ సీనియర్లు కూడా నడవడం ఖాయం..అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ కుప్పకూలడం ఖాయం. మరి జానాసారు హస్తంను వీడి గులాబీ గూటికి చేరుతారో లేదో చూడాలి.

- Advertisement -