ఈటల కోవర్ట్ రాజకీయాలపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!

119
- Advertisement -

హుజురాబాద్ ఉప ఎన్నికల వేళ కాషాయ పార్టీకి కోలుకోలేని దెబ్బపడింది. హుజురాబాద్‌ పట్టణ బీజేపీ అధ్యక్షుడు నందగిరి మహేందర్ రెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పాడు. తన రాజీనామా లేఖను బండి సంజయ్‌కు పంపారు. కాగా గురువారం అర్థరాత్రి నందగిరి మహేందర్ రెడ్డి అలియాస్ లడ్డూను అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి లేఖ విడుదల చేయడంతో కాషాయ పార్టీ వర్గాలు షాక్ అయ్యాయి. మొదటి నుంచి పార్టీ బలోపేతం కోసం నిబద్ధతతో పని చేస్తున్న లడ్డూను అధ్యక్ష పదవి నుంచి తప్పించడం ఏంటీ..ఇదంతా ఈటల రాజేందర్ కుట్ర అంటూ స్థానిక బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. వారి అనుమానమే నిజమైంది. తనను తొలిగిస్తూ జిల్లా బీజేపీ నాయకత్వం లేఖ మీడియాకు విడుదల చేయడంతో లడ్డూ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో అర్థరాత్రి తనను బాధ్యతల నుంచి తొలగించినందుకు నిరసనగా తాను బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మహేందర్ రెడ్డి ప్రకటించారు. ఆయనతో 100 మంది బీజేపీ కార్యకర్తలు కూడా పార్టీకి రాజీనామా చేశారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఒంటెద్దు పోకడల వల్లే తనను పదవి నుంచి తొలగించారని మండిపడ్డారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై మహేందర్ రెడ్డి నిప్పులు చెరిగారు.

నిన్నమొన్న పార్టీలోకి వచ్చిన ఈటల రాజేందర్‌ ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్న నాయకులను పట్టించుకోవడం లేదని, నమస్తే పెడితే మొఖం తిప్పుకొని పోతున్నాడని మహేందర్‌రెడ్డి మండిపడ్డారు. నియోజకవర్గంలో ఉన్న బీజేపీ నాయకులంతా ఈటలపై వ్యతిరేకతతో ఉన్నారని, ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారని మహేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటలకు తన ఆస్తులు, అంతస్థులు కాపాడుకోవడం కోసమే తప్పా ‎ఆత్మగౌరవం లేదు మన్నూ మశానం లేదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్టీలో తనలాంటి సీనియర్లను బయటకు పంపిస్తూ ఈటల పదే పదే ఆత్మగౌరవం అంటూ డైలాగులు కొడుతూ ప్రజలను మభ్యపెడుతున్నాడని దుయ్యబట్టారు.. గతంలో పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు నిర్మించిన కాంప్లెక్స్‌లోని ఓ షట్టర్‌ను కూల్చి దానికి ఈటల రాజేందర్ కాంప్లెక్స్ అని పేరు మార్చుకున్నది వాస్తవం కాదా అని ఈటలను లడ్డూ నిలదీశారు. బీసీ బిడ్డను అని చెప్పుకుంటున్న ఈటల మున్సిపల్ ఎన్నికల్లో పంజాల సతీష్ గౌడ్ అనే బీసీ బిడ్డ బీజేపీ తరపున కౌన్సిలర్‌గా పోటీ చేస్తే ఆయన ఇంట్లో సీఐనీ కూర్చోబెట్టి బయటకు వెళ్లనివ్వకుండా చేసిన నీచుడు ఈటల అని ఆరోపించారు.

ఈటల ఎన్ని ఒత్తిళ్లు చేసినా, ఎంతగా బెదిరించినా సతీష్ గౌడ్ కేవలం ఒక్క ఓటుతోనే ఓడిపోయాడని, అదీ ఆయన చరిత్ర అంటూ లడ్డూ ఫైర్ అయ్యారు. బీజేపీ సీనియర్ నేతలను ఒక్కొక్కరిగా బయటకు పంపిస్తూ..మళ్లీ ఏమి తెలియనట్లు వాళ్లను టీఆర్ఎస్ నాయకులు కొంటున్నారంటూ ఈటల తప్పుడు విమర‌్శలు చేస్తున్నాడని మహేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.మొత్తంగా ఈటల కుట్రల వల్లే తనను అధ్యక్ష పదవి నుంచి తొలగించారని, అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు మహేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హుజురాబాద్ బీజేపీలో కలకలం రేపుతున్నాయి. మరి మహేందర్‌రెడ్డి టీఆర్ఎస్ గూటికి చేరుతారో లేదా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటాడో చూడాలి.

- Advertisement -