ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెలంగాణలో పొలిటికల్ హీట్ తారా స్ధాయికి చేరింది. ఓ వైపు అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతుండగా కాంగ్రెస్,టీడీపీ,సీపీఐ,టీజేఎస్ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రజాకూటమిలో ఇంకా పోటీ చేసే స్ధానాల్లో కనీసం క్లారిటీ లేని పరిస్ధితి నెలకొంది. తొలుత మహాకూటమిగా ఏర్పడినా తర్వాత ప్రజాకూటమిగా మారి పలుదఫాలుగా పోటీ చేసే స్ధానాలపై కసరత్తు జరిపినా ప్రయోజనం లేకపోయింది.
దీంతో కాంగ్రెస్.. పోటీ చేసే స్ధానాల విషయంపై భాగస్వామ్య పక్షాలతో చర్చించేందుకు జానారెడ్డి నేతృత్వంలో కమిటీ ఏర్పడింది. అయినా చర్చలు ఫలప్రదం అయ్యేలా కనిపించడం లేదు. కూటమిలో చేరినప్పడి నుంచి 20 అసెంబ్లీ స్ధానాలను అడుగుతున్న టీడీపీ, ఏ మాత్రం తగ్గేది లేదని స్పష్టం చేస్తోంది.
అయితే కాంగ్రెస్ మాత్రం టీడీపీకి 10-12, టీజేఎస్‌కు 8-10, సీపీఐకి 2 స్థానాలు ఇవ్వడానికి మాత్రమే సుముఖంగా ఉంది. దీంతో ఎన్నిసార్లు చర్చలు జరిగినా విఫలమవుతున్నాయి. టీడీపీ సంగతి ఇలా ఉంటే టీజేఎస్ పరిస్ధితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. టీజేఎస్ 30 స్ధానాలు అడుగుతుండగా కాంగ్రెస్ ఎట్టిపరిస్ధితుల్లో 10 స్థానాలను మించి ఇచ్చేది లేదని తేల్చి చెబుతోంది.
అంతేకాదు టీజేఎస్ అభ్యర్థులు కాంగ్రెస్ బీ ఫారంపైనే పోటీ చేయాలనే ఆ పార్టీ నేతలు ప్రతిపాదించడంతో చిక్కుల్లో పడ్డారు కొదండరాం అండ్ కో. సీట్ల విషయంలో కాంప్రమైజ్ అయినా టీజేఎస్ కోరుకున్న స్థానాలు ఇచ్చే పరిస్ధితిలో కాంగ్రెస్ లేదు. ఇదే విషయాన్ని ఆ పార్టీ నేతలకు చెప్పినట్లు సమాచారం. టీజేఎస్ చీఫ్ కోదండరాంది కూడా ఇదే పరిస్ధితి. వరంగల్ వెస్ట్ లేదా జనగాం పోటీ చేయాలని కోదండరాం భావించారు. అయితే ఈ రెండు స్థానల్లో కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతలు బరిలో ఉండడంతో ఆయనకు మొండి చేయి మిగిలింది.
ఇక టీడీపీ,సీపీఐ,టీజేఎస్‌తో పాటు కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశీస్తున్న వారు అవసరమైతే రెబల్స్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుండటంతో రానున్న రోజుల్లో ప్రజాకూటమికి మరిన్ని కష్టాలు తప్పేలా కనిపించడం లేదు.