Friday, November 22, 2024
Home టాప్ స్టోరీస్ ఓట్ల కోసమే.. కాంగ్రెస్ ఉచితాలు !

ఓట్ల కోసమే.. కాంగ్రెస్ ఉచితాలు !

33
- Advertisement -

సాధారణంగా ఎన్నికల టైమ్ లో ఇచ్చే హామీలను బట్టి ప్రజలు ఆకర్షితులౌతూ ఉంటారు. దానిని దృష్టిలో పెట్టుకొనే రాజకీయ పార్టీలు కూడా మేనిఫెస్టోలను రూపొందిస్తూ ఉంటాయి. అయితే రాష్ట్ర ఆర్థికస్థితిని దృష్టిలో ఉంచుకొని హామీలు ప్రకటించడం వేరు. కేవలం ఓటర్లను దృష్టిలో పెట్టుకొని హామీలను ప్రకటించడం వేరు. తెలంగాణలో కాంగ్రెస్ రెండో కేటగిరీలోకి వస్తుంది. ఉచితాలే ఎజెండాగా కేవలం ఓట్ల కోసమే మేనిఫెస్టో రూపొందించి ఎలాగోలా అధికారంలోకి వచ్చింది హస్తం పార్టీ. ఇక మిగిలింది వాటిని అమలు చేయడమే. అయితే కాంగ్రెస్ ప్రకటించిన హామీలను అమలు చేయాలంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై అదనపు భారం పడుతుందని విశ్లేషకులు మొదటి నుంచి కూడా చెబుతూ వస్తున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన హామీలు ఆర్థికాభివృద్ధికి తూట్లు పొడిచేలా ఉన్నాయని, వాటి అమలు దాదాపు అసాధ్యం అని జయ ప్రకాష్ నారాయణ వంటి వారు బహిరంగంగానే వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు.

అయితే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం దాదాపు అసాధ్యం అని స్వయంగా ఆ పార్టీ నేతలే ఒప్పుకుంటున్న పరిస్థితి. తెలంగాణలో మాదిరిగానే ఐదు గ్యారెంటీల పేరుతో కర్నాటకలో అధికారం సాధించిన కాంగ్రెస్ వాటి అమలు అసాధ్యం అని చేతులెత్తేస్తున్న పరిస్థితి. ఇటీవల కర్నాటక అసెంబ్లీ సమావేశాల్లో ఉచిత హామీలపై ఆ రాష్ట్ర సి‌ఎం సిద్దిరామయ్య మాట్లాడుతూ ” ఎన్నికల్లో ఓట్ల కోసమే హామీలు ఇచ్చామని.. అయినంత మాత్రాన వాటిని అమలు చేయడం కష్టమని, ఒకవేళ అమలు చేయాలని ఉన్నప్పటికి రాష్ట్ర బడ్జెట్ సరిపోదని చేతులెత్తేశారు.” దీంతో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు  వ్యతిరేకత ఎదురవుతోంది. భవిష్యత్ లో తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడనుందా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. దీంతో ఉచిత హామీలను ప్రకటించి ప్రజలను మోసం చేసిందని కాంగ్రెస్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఏది ఏమైనప్పటికి కేవలం ఓట్ల కోసమే ఉచిత హామీలు ప్రకటించామని స్వయంగా కాంగ్రెస్ నేతలే ఒప్పుకోవడం గమనార్హం.

- Advertisement -