త్వరలో జరగపోయే ఎన్నికలపై అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ గట్టిగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ రెండు పార్టీలు కూడా వ్యూహాలు రచిస్తున్నాయి. అందులో భాగంగానే ఆ మద్య పార్టీలో కీలక మార్పులు చేసింది బీజేపీ అధిష్టానం. ఆయా రాష్ట్రాలలో అధ్యక్ష పదవుల్లో మార్పులు చేయడంతో పాటు ఇతరత్రా కీలక పదవుల్లో కొత్తవారిని నియమించింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా సేమ్ ప్లాన్ అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పలు రాష్ట్రాలలో కాంగ్రెస్ నాయకత్వ మార్పులు చేపట్టేందుకు హస్తం పార్టీ సిద్దమైనట్లు తెలుస్తోంది. .
తాజాగా యూపీ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా మాజీ ఎమ్మెల్యే అజయ్ రాయ్ ని నియమించింది. అలాగే మద్య ప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జ్ గా రణధీప్ సుర్జేవా కు బాద్యతలు అప్పగించింది. అదే విధంగా కర్నాటక ఇంచార్జ్ గా కూడా సుర్జేవానే కొనసాగనున్నారు. గుజరాత్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా ముకుల్ వస్నిల్ ను నియమించింది. ఇక తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా మాణిక్ రావ్ ఠాక్రే కొనసాగుతున్నారు. ఈ ఏడాది ఆ బాద్యతలు చేపట్టిన ఆయన ఎన్నికలు పూర్తి అయ్యే వరకు కొనసాగే అవకాశం ఉంది. ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కూడా మార్చే అవకాశం ఉందని గత కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తెలంగాణలో బలమైన నేతగా ఉన్న రేవంత్ రెడ్డిని అధ్యక్ష పదవి నుంచి తప్పించే రిస్క్ కాంగ్రెస్ అధిష్టానం చేస్తుందా అనేది సందేహమే. మొత్తానికి ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది లోపాలను సరి చేసుకునేందుకు హస్తం పార్టీ ప్రక్షాళనపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మరి కాంగ్రెస్ వ్యూహలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.
Also Read:గ్రీన్ ఛాలెంజ్‌కు మీరే రోల్ మోడల్స్:ఎంపీ సంతోష్