అసహనం, నిరుద్యోగం భారత్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. అమెరికాలో రెండు వారాల పర్యటనలో వున్న రాహుల్ గాంధీ అక్కడ పలు సమావేశాల్లో పాల్గొంటున్నారు. సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ (సిఎపి) నేతృత్వంలో జరిగిన సమావేశంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో సిఎపి అధ్యక్షులు నీరా టండన్, భారత్‌లో అమెరికా రాయబారిగా పని చేసిన రిచర్డ్ వర్మ, హిల్లరీ క్లింటన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాహుల్ ఉద్యోగాలు సృష్టించడంలో భారత ప్రభుత్వం విఫలమయిందని, దీని దేశాన్ని ప్రమాదకర పరిస్థితుల్లోకి తీసుకుని వెళుతుందని అన్నారు.
ఎప్పుడూ ప్రధాని మోడీని విమర్శించడమే పనిగా పెట్టుకున్న రాహుల్ గాంధీ మోడీని ప్రశసించారు. న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సంధర్బంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం తనకు ఎంతో బాగా నచ్చిందని రాహుల్ గాంధీ అన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా నాకు బాగా నచ్చింది. కానీ దాని అమలు సక్రమమైన పద్ధతిలో లేదు. పెద్ద వ్యాపారులను లక్ష్యంగా పెట్టుకోవాలని మోదీ భావిస్తున్నారు. కానీ మధ్య, చిన్న తరహా కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటే బాగుండేది. అక్కడి నుంచే ఎక్కువగా ఉద్యోగావకాశాలు ఉంటాయి.’ అని రాహుల్ తెలిపారు.
భారత్‌లో నిత్యం 30వేల మంది యువత ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ 450 మాత్రమే ఉద్యోగాలు ఉంటున్నాయని రాహుల్ పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియాను కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయిందని ఆయన స్వీయ విమర్శ చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని గత ప్రభుత్వాలు ఉద్యోగాల కల్పనలో విఫలమయ్యాయని రాహుల్ గాంధీ అంగీకరించారు. ఇటీవల కాలిఫోర్నియా యూనివర్సిటీలో ప్రసంగిస్తున్న సమయంలో కూడా మోడీని ప్రశంసించారు రాహుల్.