కర్నాటక సీఎంగా కుమారస్వామి..!

206
Congress backs HD Kumaraswamy as CM
- Advertisement -

దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేపిన కర్నాటక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అందరు ఉహించినట్లే ఏ పార్టీకి కన్నడ ప్రజలు మెజారిటీని కట్టబెట్టలేదు. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించగా కాంగ్రెస్ రెండో స్ధానంలో నిలిచింది. కొద్దిసేపటి క్రితమే సీఎం సిద్దరామయ్య తన రాజీనామాను గవర్నర్‌కు సమర్పించారు. జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.

ఈ మేరకు దేవెగౌడతో కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, అశోక్‌ గెహ్లాట్‌ మంతనాలు జరిపారు. జేడీఎస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడితే రెండో సారి కన్నడ సీఎంగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమే కానుంది. ప్రస్తుతం సింగపూర్‌లో ఉన్న కుమారస్వామి రాష్ట్రంలో నెలకొంటున్న పరిస్థితులపై సింగపూర్ నుంచి ఆయన సమీక్షిస్తున్నారు. తమ పార్టీ నేతలు, తండ్రి హెచ్ డీ దేవగౌడతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇవాళ రాత్రికి కుమారస్వామి బెంగళూరుకు తిరిగిరానున్నారు. రామనగర నుంచి పోటీచేసిన కుమారస్వామి ఘన విజయం సాధించారు.

అధికారం చేపట్టాలంటే 112 సీట్లు సాధించాల్సి ఉండగా.. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ 105 సీట్లను సాధించి మేజిక్‌ ఫిగర్‌కి 8 సీట్ల దూరంలో నిలిచింది. దీంతో కాంగ్రెస్,జేడీఎస్ కలిసి అధికారం చేపట్టేందుకు మార్గం సుగమమైంది. 2004లో కూడా ఇలాంటి పరిస్ధితి ఏర్పడగా కాంగ్రెస్-జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగా కొద్దిరోజుల్లోనే జేడీఎస్..కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకుని బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.

- Advertisement -