తెలంగాణ కాంగ్రెస్ మరో షాక్ తగలనుంది. ఇటివలే యాదాద్రి భువనగిరి జిల్లా డిసిసి అధ్యక్షులు, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సీనియర్ నేత పార్టీని వీడుతున్నట్లు సమాచారం. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. త్వరలో నర్సాపూర్ లో జరిగే బహిరంగ సభలో ఆమె గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తుంది.
ఇవాళ ఉదయం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఆమె భేటీ అయ్యారు. పార్టీలో చేరికపై వారిద్దరితో సునీతా లక్ష్మారెడ్డి చర్చించినట్టు తెలుస్తోంది. సునీతా బీజేపీలో చేరుతారని నిన్నటి వరకూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆమె రాకకోసం చివరి వరకూ మెదక్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించలేదు.
ఆమె పార్టీలో చేరికపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో వేరే అభ్యర్ధిని ప్రకటించింది బీజేపీ. కాంగ్రెస్ లో మెదక్ ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆమె అధిష్టానంపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. రోజుకి ఒకరు పార్టీకి గుడ్ బై చెప్పుతుండటంతో ఏం చేయాలో అర్ధంకాని పరిస్ధితి ఉన్నారో కాంగ్రెస్ పెద్దలు.