వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాననే మాటకు కట్టుబడి ఉన్నానని మంత్రి కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. గద్వాల విసిరిన సవాల్ కు ఇప్పటికీ కట్టుబడే ఉన్నానని చెప్పారు. మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. లోకల్ మర్డర్ జరిగితే అదేదో రాష్ట్ర సమస్య గా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ లోఫర్ పార్టీ అని ఎండగట్టిన కేటీఆర్ రాహుల్ ఓ పప్పు అని..గుగూల్‌లో వెతికినా అదే వస్తుందన్నారు. ఎమర్జెన్సీ విధించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు.
తాను విసిరిన సవాల్‌కు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సిద్ధంగా ఉండాలని, కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే రాజకీయాల నుంచి ఆయన తప్పుకుంటారా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు వస్తాయని ఇష్టానుసారం మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మడం లేదని అన్నారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీఆర్ఎస్‌లోకి వచ్చే ప్రయత్నాలు చేశాడని తెలిపారు. రాష్ట్రంలో అల్లర్లకు నరమేథానికి పాల్పడిన చరత్ర కాంగ్రెస్ పార్టీదని మండిపడ్డారు. ఎన్ని ప్రభుత్వాలను కూలగొట్టలేదని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ ఎవరిని మెప్పించలేదని…రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను ఎందుకు నేరవేర్చడం లేదన్నారు కేటీఆర్. పనిచేసే ప్రభుత్వాలను అందరు ఆదరిస్తారని..మిషన్ భగీరథ,మిషన్ కాకతీయ ఫలాలు అందడం మొదలైతే తమ బలం ఇంకా పెరుగుతుందన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చు,పార్టీలు పెట్టుకొవచ్చని కానీ ఎన్నికల్లో ప్రజలు ఎవరిని ఆదరిస్తే వారిదే గెలుపన్నారు.