యూట్యూబ్, పేస్ బుక్, ట్విట్టర్.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే ట్రేండింగ్. మలయాళి పిల్ల ప్రకియ ప్రకాష్ వారియర్ గురించే చర్చంతా. వాలెంటైన్స్ డేకి రెండు రోజుల ముందుగా ఓరు అడార్ లవ్ చిత్రానికి సంబందించిన ఓ వీడియోని విడుదల చేశారు. ఆ పాటలో ప్రియా వారియర్ కన్నుగీటిన విధానం, ఆమె హావభావాలు కురాళ్ళ హృదయాలు మటాష్ అయిపోయాయి. అయితే ఓవర్‌నైట్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయిన ఈ బ్యూటీపై ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది.
తాజాగా ముంబై నగరానికి చెందిన పలు ముస్లిమ్ సంఘాలు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశాయి. ముహమ్మద్ ప్రవక్తను కించపర్చేలా ఉన్న మళయాళం చిత్రంలోని పాటను చిత్రం నుంచి తొలగించేందుకు జోక్యం చేసుకోవాలని రజా అకాడమీ ప్రతినిధి లేఖ రాశారు. ప్రియా వారియర్ నటించిన పాట తమ ముస్లిముల మనోభావాలను దెబ్బతీసిందని దీనిపై చర్యలు తీసుకోవాలని రజా అకాడమీ సభ్యులు ముంబై పోలీసు కమిషనరుతోపాటు ఫిలిం సర్టిఫికేషన్ బోర్డులకు ఫిర్యాదు చేశారు. ఈ పాట ముహమ్మద్ ప్రవక్త అతని భార్యను తప్పుగా చూపిస్తూ ముస్లిమ్ పెద్దలను అవమానిపర్చేలా ఉందని రజా అకాడమి వ్యవస్థాపక అధ్యక్షుడు సయీద్ నూరీ చెప్పారు.
సోషల్ మీడియాలో విడుదలై వైరల్ అయిన మళయాళ చిత్రం పాటను ఉపసంహరించుకోవాలని తంజీమ్ ఉలేమా -ఏ- అహ్లే సున్నత్ జ అల్ హఖ్ వెల్ఫేర్ ఫౌండేషన్ డిమాండు చేసింది. ముంబై నగరంలోని మల్వానీకి చెందిన ఈ సంస్థ ప్రియా వారియర్ నటించిన పాటపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. మొత్తం మీద సోషల్ మీడియాలో సంచలనం రేపిన ప్రియావారియర్ పాట ముస్లిమ్ సంస్థల ఫిర్యాదులతో వివాదాస్పదంగా మారింది.
ఈ పాటపై హైదరాబాద్ ఫరూక్ నగర్‌కు చెందిన కొంత మంది ముస్లిం యువకులు ఫలక్‌నుమా స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా పాట చిత్రీకరణ జరిగిందని, ప్రియా ప్రకాశ్‌తో పాటు చిత్ర నిర్మాత, దర్శకులపై తగిన చర్యలు తీసుకోవాలంటూ వారు తమ లిఖితపూర్వక ఫిర్యాదులో పేర్కొన్నారు.