ఇందిరా బాటలోనే మోడీ…పరాభవం తప్పదేమో..!

220
- Advertisement -

మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ దారిలోనే ప్రధానమంత్రి నరేంద్రమోడీ నడుస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎందుకంటే కొందరు నాయకులు తాము తీసుకున్న అత్యంత కఠిన నిర్ణయాలు వెనక్కి తీసుకోవడం లో ఇంట్రెస్ట్ చూపించరు. వాటి పర్యవసానాలు ఎలా ఉన్నా – ఆ నిర్ణయం తప్పు అని తేలినా కూడా దాని ఫలితం ఆఖరి వరకూ పాజిటివ్ గా ఉంటుంది అనే ఉద్దేశ్యం తోనే ముందుకుసాగుతారు.

అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవలిసిన వ్యక్తులు ఇందిరా గాంధీ , నరేంద్ర మోడీ. నాడు ఇందిరా చేసిన తప్పునే నేడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేస్తున్నారు.1967 లోక్ సభ విజయం తరవాత ఇందిరా తీసుకున్న నిర్ణయాలూ 2014లో అధికారం చేపట్టిన తర్వాత రెండున్నరేళ్ల తర్వాత మోడీ తీసుకుంటున్న చర్యలు స్థూలంగా ఒకేలా కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పెద్ద నోట్లు రద్దు చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మోడీ…అంతకుమించి తలనొప్పులను కొని తెచ్చుకున్నారు.

పెద్ద నోట్లు రద్దుచేసి 23 రోజులవుతున్నా నగదు కష్టాలు తీరడం లేదు. డబ్బుల కోసం ఏటీఎంలు, బ్యాంకుల మందు ప్రజలు భారీ క్యూ కడుతున్నారు. నగదు పెట్టిన నిమిషాల్లోనే ఏటీఎంలు ఖాళీ అవుతున్నాయి. పలు ఏటీఎం సెంటర్ల ముందు నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల పని చేయని ఏటీఎంలతో జనం విసుగుచెందుతున్నారు. బ్యాంకుల వద్ద వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఫించన్ దారులకు తిప్పలు తప్పడం లేదు. నిత్యావసర సరుకులు కొనుక్కునేందుకు ఇక్కట్లు పడుతున్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా మోడీ మాత్రం నోట్లరద్దు విషయంలో వెనక్కి తగ్గడమే లేదు.

comparison between Modi and Indira

రాజభరణాల రద్దు – బ్యాంకుల జాతీయకరణ.. అనే రెండు కీలక చర్యలను నాడు ఇందిరాగాంధీ తీసుకున్నారు. ఈ రెండు నిర్ణయాలు ఆమెను పేదలకు ప్రీతిపాత్రురాలిని చేశాయి. ఆ ఊపులో 1971 ఎన్నికల్లో గరీబీ హఠావో అనే నినాదంతో ఇందిర పోటీచేసి.. అద్భుత విజయం సాధించారు. ఆ ఏడాది డిసెంబర్ లో బంగ్లాదేశ్ యుద్ధం లో కూడా గెలిచి ప్రతిపక్షం అనేది లేకుండా చేశారు ఇందిరా.కానీ.. అప్పటికే ఆమెను ముప్పు తెలియకుండా చుట్టుముట్టింది. ఇందిర ప్రభుత్వం తట్టెడు వాగ్దాలు ఇచ్చింది. అయితే.. అమలు చేసింది శూన్యం.

1973 నాటికి ద్రవ్యోల్బణం పెరిగిపోయి.. నిత్యావసరాల ధరలు కొండెక్కాయి. విద్యార్థి ఆందోళనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే 1974లో పోఖ్రాన్ లో అణుపాటవ పరీక్షను భారత్ నిర్వహించింది. కానీ దిగరుతున్న ఇందిర ప్రతిష్ఠను ఆ పరీక్ష నిలువరించలేక పోయిం ది. 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించిన ఇందిర.. 1977 మార్చిలో ఎన్నికలకు వెళ్లారు. ఒక్కతాటిపైకి వచ్చిన ప్రతిపక్షం కాంగ్రెస్ కు దారుణ పరాజయాన్ని మిగిల్చింది. అయితే ఇంతటి దారుణ పరిస్థితులకు కారకురాలైన ఇందిరా గాంధీ ఆ తరువాత ఒక మాట అన్నారు. భారతీయ సమాజం ఎంత సంఘటితంగా, పటిష్ఠంగా ఉన్నదో గుర్తించి అనుకుంటా మరో వేయి సంవత్సరాల వరకు ఈ దేశంలో తిరిగి అత్యవసర పరిస్థితి విధించడం సాధ్యం కాదని  ప్రకటించారు.

comparison between modi and indira

అలాంటి పరిస్థితి ఇప్పుడు మోడీ కి ఎదురైంది. 2014 ఎన్నికల్లో నల్లధనం, యువతకు ఉద్యోగాలపై అనేక వాగ్దానాలిచ్చారు. నమో జపంతో బీజేపీ తిరుగులేని మెజారిటీ సాధించింది. కానీ ఇచ్చిన వాగ్దానాల అమలులో విఫలమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేశారు. కానీ ఇంతలోనే పెద్దనోట్లు రద్దుచేసి ప్రజల అసహనానికి మోడీ సర్కార్ గురైంది. ఇంకొన్నాళ్లు ఇదే పరిస్థితి ఎదురైతే నాడు ఇందిర మాదిరిగానే మోడీకి పరాజయం తప్పదు అనీ రాజకీయ విశ్లేషకులు కుండ బద్దలు కొడుతున్నారు.

comparison between modi and indira

- Advertisement -