తెలుగు చిత్రపరిశ్రమలోకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి.. జబర్దస్త్ షోతో ఒక్కసారిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అభి. జబర్దస్త్ కి అభిగా పరిచయమై అదిరే అభిగా మారిపోయాడు. కొద్ది రోజులుగా జబర్దస్త్ నుంచి వెళ్లి సినిమాల వైపు అడుగులు వేశారు. పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడమే ఏమో తెలియదు కానీ.. తాజాగా జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆభి. దర్శకుడు రాజమౌళి గురించి ప్రస్తావించారు.
తనకు మొదటి నుంచి దర్శకత్వంపై ఆసక్తి ఉండేదని.. కానీ అనుకోకుండా నటనవైపు వచ్చేశానని అన్నాడు. ఆ ఆసక్తితోనే బాహుబలి2కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశానన్నారు. ఆ సమయంలోనే రాజమౌళి గొప్పతనం ఏంటో అర్థమైందని చెప్పాడు. ఆయన దగ్గర పని చేసే అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ‘టీ’ బాయ్ వరకు అందరిని పేరు పెట్టి పిలుస్తాడని, అంతమందిలోనూ అందరిపేర్లు గుర్తుపెట్టుకోవడం చూసి ఆశ్చర్యపోయానని పేర్కొన్నాడు.
ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారని, ఎవరిపైనా చికాకు పడకుండా చాలా ఓపికతో పని చేస్తారని, సాధ్యమైంతవరకు ఆయన పని ఆయనే చేసుకుంటారని, ఇతరులకు చెప్పరు అదే ఆయన గొప్పతనమంటూ చెప్పుకొచ్చాడు. ఇది నేను ప్రత్యక్షంగా చూశానని చెప్పాడు. వర్క్ పట్ల ఆయన నిబద్ధతకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే అంటున్నాడు అభి.