తెలంగాణను చలి వణికిస్తోంది. ఉత్తర భారతం నుంచి వీస్తున్న శీతల గాలుల కారణంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. నాలుగైదు రోజులుగా చలితీవ్రత పెరగడంతో జనం అల్లాడిపోతున్నారు. రాత్రి వేళ్లలో కనిష్ట ఉష్ణోగ్రత ఏకంగా ఐదు డిగ్రీలకు పడిపోవడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే వణికిపోతున్నారు.
చలి బాధ తట్టుకోలేక తెలంగాణ వ్యాప్తంగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. కరీంనగర్ జిల్లాలో ఒక్కరోజే ఏడుగురు చనిపోయారు.వరంగల్‌లో 6 గురు,ఖమ్మం జిల్లాలో 5 గురు మృత్యువాత పడ్డారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నలుగురు,ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు మృతిచెందారు. రానున్న ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రాత్రి సమయాల్లో బయటకు వెళ్లేవారు ముఖాలకు, చేతులకు మాస్క్‌లు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. తగ్గిన ఉష్ణోగ్రతలతో తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. చలి బారినపడకుండా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, రోగులు, పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.