అల్లూరి సీతారామరాజు జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కి పడిపోవడంతో ఏజెన్సీ ప్రాంతాలు గడ్డకట్టే స్థాయిలో వణుకుతున్నాయి. ప్రత్యేకంగా అరకులోని దళపతి గూడెంలో 3.6 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదై ఈ సీజన్‌లోనే అత్యంత చలిగా నిలిచింది.
ఇతర ప్రాంతాల్లో కూడా పరిస్థితి భయంకరంగానే ఉంది. డుంబ్రిగూడ, జి.మాడుగులలో 3.9 డిగ్రీలు, హుకుంపేటలో 4.6 డిగ్రీలు, ముంచింగిపుట్టు మరియు పాడేరు ప్రాంతాల్లో 4.8 డిగ్రీలు, పెదబయలులో 6.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ స్థాయిలో చలి పడటం అరుదు కావడంతో గిరిజన ప్రాంతాలు దాదాపు తెల్లవారుజాము వరకు మంచుతో కప్పబడినట్లు కనిపిస్తున్నాయి.
తీవ్రమైన చలి కారణంగా గిరిజనులు బయటకు రావడం కూడా కష్టంగా మారింది. ఉదయం పొగమంచు దట్టంగా ఉండటం, గాలులు ఎముకలు కొరికే స్థాయిలో వీయడం వల్ల సామాన్య జీవితంపై తీవ్ర ప్రభావం పడుతోంది. చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా పరిస్థితిని మరింత ఆందోళనకరంగా చూపిస్తున్నాయి. ఈ నెల 13వ తేదీ వరకు చలిగాలుల తీవ్రత కొనసాగి మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తోంది. అల్లూరి జిల్లాతో పాటు శ్రీకాకుళం, శ్రీ సత్య సాయి, అన్నమయ్య, విజయనగరం, కర్నూలు, చిత్తూరు, కాకినాడ, ఎన్టీఆర్, నంద్యాల, ఏలూరు, అనంతపురం జిల్లాల్లో కూడా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల లోపు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. చలి తీవ్రత దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అవసరం లేనప్పుడు ఇంటి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.
Also Read:TG:ఇంటర్ పరీక్షల షెడ్యూల్ 2026 విడుదల..

