ప్రధాని మోదీ చెప్పేది ఒకటి…చేసేది మరొకటి అనేది అందరికీ తెలిసిందే..పొద్దున లేస్తే దేశం కోసం…ధర్మం కోసం అంటూ..తామంత నీతిమంతులు, సుద్దపూసలు ఎవరూ లేనట్లుగా కాషాయ నేతలు కబుర్లు చెబుతరు..కాని చేసేవన్నీ కంత్రీ పనులే… గత ఏడేళ్లుగా ప్రభుత్వ రంగ సంస్థలను వరుసగా ప్రైవేటీకరణ పేరుతో తన గుజరాతీ దోస్తులు అంబానీలు, అదానీలకు దోచిపెడుతున్న మన మోదీ సార్ ఇప్పుడు ఏకంగా బొగ్గు గనులను కూడా వాళ్లకు అప్పగించేందుకు రెడీ అవుతున్నారు.
ఆల్రెడీ మన తెలంగాణ నల్లబంగారు ఖని..సింగరేణి బొగ్గు గనులపై కన్నేసిన మోదీ సారు ఏకంగా నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే తాజాగా ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రూ. 6 వేల కోట్ల బొగ్గు కుంభకోణం జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. మోదీగారు గుజరాత్‌కు మూడుసార్లు సీఎంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. మోదీ హయాంలో రాష్ట్రంలోని చిన్న, మద్యతరహా పరిశ్రమలకు ఉద్దేశించిన బొగ్గును ఇతర రాష్ట్రాలలోని పెద్ద కంపెనీలకు అమ్మేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. . నిర్ణీత గడువుతో దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేసింది. ఈ కుంభకోణం చోటుచేసుకున్న 14 సంవత్సరాల కాలంలో ముగ్గురు ముఖ్యమంత్రులు ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీతో సహా విజయ్ రూపాణీ, భూపేంద్ర పటేల్ తదితరులు పరిశ్రమలు, గనులు, ఖనిజాల శాఖను తమవద్దే అట్టిపెట్టుకోవడం కాకతాళీయం కాకపోవచ్చని, ఇది అనుమానాలకు తావిస్తుందని కాంగ్రెస్ ప్రతినిధి గౌరవ్ వల్లభ్ మీడియాకు చెప్పారు. కోల్ ఇండియా గనుల నుంచి వెలికి తీసిన బొగ్గు ఉద్దేశించిన పరిశ్రమలకు చేరలేదని ఆయన విమర్శించారు.. 2001 నుంచి 2014 వరకు 14 సంవత్సరాల్లో 60 లక్షల టన్నుల బొగ్గును కోల్ ఇండియా గుజరాత్‌లోని వ్యాపారులు, చిన్నపరిశ్రమదారుల పేరిట పంపిందని చెప్పారు. ఆ బొగ్గు సగటు ధర టన్నుకు రూ.1,800 నుంచి రూ.3,000 వరకు ఉంటుంది. కానీ దానిని ఇతర రాష్ట్రాలలో రూ.8,000 నుంచి రూ.10,000 వరకు అధికధరకు అమ్మారని వల్లభ్ ఆరోపించారు.
గుజరాత్ ప్రభుత్వం లబ్ధిదారుల గురించి పంపిన వివరాలు నకిలీవని తేలిందని, ఉద్దేశించిన గమ్యానికి బొగ్గు చేరనే లేదని అన్నారు. బొగ్గు నుంచి లబ్ధి పొందేందుకు బహుశా నకిలీ బిల్లులు సృష్టించి ఉంటారని వల్లభ్ అనుమానాలు వ్యక్తం చేశారు. గుజరాత్‌లో జరిగిన 6 వేల కోట్ల బొగ్గు స్కామ్‌లో మోదీ పాత్రపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. మొత్తంగా గుజరాత్‌లో జరిగిన 6 వేల కోట్ల బొగ్గు స్కామ్‌లో నాటి సీఎం మోదీ హస్తం ఉందంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపుతున్నాయి. మరి కోల్ స్కామ్‌లో బీజేపీ సీఎంల హస్తంపై కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశిస్తుందా…లేదా ఎప్పటిలానే మోదీగారికి క్లీన్‌చిట్ ఇస్తుందా అనేది చూడాలి.